సొంత పార్టీలో ఒంటరైన జీవన్ రెడ్డి.. పొమ్మన లేక పొగ..?

by I. Sairam |

దశాబ్దాల పాటు జగిత్యాల కాంగ్రెస్‌కు దిక్సూచిగా నిలిచిన సీనియర్ నేత జీవన్ రెడ్డి, మారుతున్న రాజకీయ సమీకరణల మధ్య నేడు సొంత పార్టీలోనే ఒంటరవుతున్నారా? అన్న చర్చ మొదలైంది.

సొంత పార్టీలో ఒంటరైన జీవన్ రెడ్డి..  పొమ్మన లేక పొగ..?
X

దశాబ్దాల పాటు జగిత్యాల కాంగ్రెస్‌కు దిక్సూచిగా నిలిచిన సీనియర్ నేత జీవన్ రెడ్డి, మారుతున్న రాజకీయ సమీకరణల మధ్య నేడు సొంత పార్టీలోనే ఒంటరవుతున్నారా? అన్న చర్చ మొదలైంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరగా, సీనియారిటీ కంటే గెలుపు గుర్రాలకే హైకమాండ్ పెద్దపీట వేస్తుండడం ఆయన వర్గంలో అసహనం కలిగిస్తోంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన నాయకుడికి, ఇప్పుడు పార్టీ నిర్ణయాల్లో కనీస ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ‘అప్డేటెడ్ పాలిటిక్స్’పేరుతో పాతతరం నాయకత్వాన్ని పక్కన పెడుతున్న తీరు, జీవన్ రెడ్డిని పొమ్మనలేక పొగ పెడుతున్నారా? అన్న వాదనలకు బలాన్నిస్తోంది. అధిష్టానం మౌనం వహిస్తుండడంతో జగిత్యాల కాంగ్రెస్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి నేడు సొంత పార్టీలోనే ఒంటరైనట్లు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా నిలిచిన ఆయన ప్రాధాన్యం క్రమంగా తగ్గుతుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నిర్ణయాల్లో ఒకప్పుడు కీలకంగా ఉన్న ఆయన మాట, నేడు అధిష్టానం వద్ద మునుపటి స్థాయిలో చెల్లుబాటు కావడం లేదన్న చర్చ బలంగా వినిపిస్తోంది.

కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా జగిత్యాల కాంగ్రెస్...

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. కురువృద్ధుడైన జీవన్ రెడ్డికి కనీసం సమాచారం ఇవ్వకుండా సంజయ్‌ను చేర్చుకోవడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. సీనియర్ నేతకు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించి, ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం హైకమాండ్ చేయకపోవడం పార్టీలో చీలికలకు దారితీస్తోంది.

మారిన రాజకీయ పరిస్థితులు..

ప్రస్తుత కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియారిటీ కంటే గెలిచే సామర్థ్యం, పార్టీ ప్రయోజనాలే కీలకమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు పార్టీ తీసుకునే నిర్ణయాలను అనివార్యంగా అనుసరించాల్సిన స్థితికి చేరుకున్నారు. వ్యవస్థే కీలకమన్న దిశగా పార్టీ అడుగులు వేస్తుండడంతో పాతతరం నాయకత్వానికి ప్రాధాన్యం తగ్గుతోంది.

పొమ్మన లేకనే పొగ పెడుతున్నారా??..

నలభై ఏళ్లపాటు ఒకే జెండాను మోసిన జీవన్ రెడ్డి, మారుతున్న ‘అప్డేటెడ్ పాలిటిక్స్’కు అనుగుణంగా మారలేకపోయారని సొంత పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. పార్టీ నుంచి నేరుగా వెళ్లమని చెప్పలేక, పరోక్షంగా ఆయనను పక్కకు నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పార్టీకి దిక్సూచిగా ఉన్న నాయకుడు, నేడు అవసరం లేని నేతగా మారిపోయారా? అన్న ప్రశ్నలు ఆయన వర్గంలో ఆవేదన కలిగిస్తున్నాయి.

Next Story