జగిత్యాల మున్సిపాలిటీకి అవినీతి రోగం !

by velandi.Saikiran |   (  Updated:2025-11-18 22:45:22  IST  )

మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టాక్స్ వసూళ్లలో 60 వేల ఫ్రాడింగ్ జరిగిందనే విషయం బయటకు పొక్కింది. దీంతో

జగిత్యాల మున్సిపాలిటీకి అవినీతి రోగం !
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపాలిటీకి అవినీతి రోగం పట్టుకుంది. బల్దియాను డీజిల్ కుంభకోణం కుదిపేస్తుంటే మరోవైపు టాక్స్ వసూళ్లలో ఫ్రాడింగ్ జరగడం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ మారినా మున్సిపాలిటినీ పీడిస్తున్న కరప్షన్ మహమ్మారి మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా తిష్ట వేసింది. వరుస వివాదాలు, పైసలిస్తేనే పర్మిషన్లు, డీజిల్ బిల్లుల్లో అక్రమాలు, టాక్స్ కలెక్షన్లలో ఫ్రాడింగ్ వంటివి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ లాప్స్ వల్లనే జరుగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇందులో చాలావరకు వివాదాలు మున్సిపల్‌లో టాప్ లెవల్ అధికారుల దృష్టికి వెళ్లినా క్రిమినల్ చర్యలకు సిఫారసు చేస్తూ కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోవడం బాధ్యుల్ని కాపాడుతున్నారనే అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చుతుంది.

టాక్స్ కలెక్షన్లలో రూ.32 లక్షల ఫ్రాడింగ్

మున్సిపల్ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో టాక్స్ వసూళ్లలో 60 వేల ఫ్రాడింగ్ జరిగిందనే విషయం బయటకు పొక్కింది. దీంతో అలర్టయిన అధికారులు టాక్స్ వసూలు చేసిన గంగ నరసయ్య అనే ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అనంతరం ఇంటర్నల్ ఎంక్వయిరీ చేయగా లక్షల్లో ఫ్రాడింగ్ జరిగిన విషయం చూసి కంగుతిన్నారు. దాదాపు 32 లక్షల రూపాయల వరకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఫ్రాడ్ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా లోలోపలే బేరసారాలు నడిపారు. ఫ్రాడ్ చేసిన సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకుని పోలీస్ కంప్లైంట్ చేయకుండా ఆగస్టు నెలలో దాదాపు 18 లక్షల వరకు తిరిగి రికవరీ చేసినట్లు సమాచారం. ఆగస్టు నెలలో మున్సిపల్ ఉద్యోగి అకౌంట్ నుంచే బల్దియా అకౌంట్‌లోకి విడతల వారీగా రికవరీ సొమ్ము జమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు నిజాలు బయటికొచ్చే అవకాశం ఉంది.

అవినీతికి అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణమా ?

జగిత్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అడ్మినిస్ట్రేషన్ లోపమే కారణమన్న విమర్శలు లేకపోలేదు. టాక్స్ కలెక్షన్‌లలో జరిగిన ఫ్రాడ్ విషయాన్ని క్యాషియర్, అకౌంటెంట్, ఆర్వోతో సహా మున్సిపల్ కమిషనర్ సైతం గుర్తించలేదు. ఏ రోజుకు ఆ రోజే కలెక్ట్ చేసిన టాక్స్‌లకు సంబంధించి వచ్చిన రసీదు ప్రింట్‌తో పాటు బల్దియా లాగిన్‌లో అప్డేట్ అవుతుంది. ఈ రెండింటిని టాలీ చేసుకుని వచ్చిన లెక్క సరిచూసుకోవాల్సి ఉంటుంది. కానీ బిల్ కలెక్టర్ ఇచ్చిన రసీదుల ఆధారంగానే క్యాష్ జమ చేసారు. ఆ తర్వాత వచ్చిన రసీదులను ప్రింట్ తీయకుండా డబ్బులు దారి మళ్లించారు. మున్సిపల్ లాగిన్‌లో అప్డేట్ అవ్వని కారణంగానే ఈ మోసాన్ని గుర్తించలేదని వాదనలు వినిపిస్తున్నప్పటికీ ఎప్పుడో ఓసారి మాత్రమే సర్వర్ ప్రాబ్లమ్ కారణంగా అప్డేట్ అవ్వకపోవడం సాధారణమే. కానీ ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఐదు నెలల పాటు లాగిన్‌లో అప్డేట్ అవ్వకుండా ఉంటుందా? ఇది ముమ్మాటికి అడ్మినిస్ట్రేషన్ లాప్స్‌నే అని వాదనలు వినిపిస్తున్నాయి.

కమర్షియల్ టాక్స్‌లలో మాఫీ మాయాజాలం

ప్రాపర్టీ టాక్స్‌ల వసూళ్ల విషయంలో బల్దియా సిబ్బంది ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. కమర్షియల్ బిల్డింగ్‌ల నిర్మాణం, కొలతలు, పూర్తయిన సంవత్సరాన్ని రికార్డుల్లో మార్చి లక్షల్లో ఉండాల్సిన టాక్స్‌లను వేలకు కుదిస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతుంది. పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద స్టేడియం పక్కన 7–6–109, 7–6–110, 7–6–111 అసెస్మెంట్ నంబర్లతో నడుస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ టాక్స్ వ్యవహారం అందుకు ఉదాహరణగా మారింది. ఈ ఆస్పత్రి 2021 సంవత్సరంలోనే నిర్మాణం పూర్తి చేసుకుని వైద్య సేవలను ఆరంభించింది. ఆ ఏడాది నుంచే టాక్స్ వసూలు చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా 2024 నుండి టాక్స్ వసూలు చేస్తున్నారు. ఏటా రూ.3.90 లక్షల పన్ను వసూలు చేయాల్సి ఉండగా 2021, 2022, 2023 సంవత్సరాలకు కలిపి రూ.11.70 లక్షల టాక్స్‌ను ఇష్టానికి మాఫీ చేశారు. ఈ అనధికార మాఫీకి దాదాపు నాలుగు లక్షల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇలాంటి మాఫీలు లెక్కలేనన్ని ఉన్నాయని టాక్ నడుస్తుంది.

క్రిమినల్ చర్యలకు ఎందుకు వెనుకడుతున్నారు?

అవినీతికి పాల్పడిన ఉద్యోగుల విషయాన్ని ఎందుకు గుట్టుగా ఉంచుతున్నారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. సంచలనం సృష్టించిన డీజిల్ కుంభకోణంతో పాటు, టాక్స్ వసూళ్లలో ఫ్రాడింగ్ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తున్నా మున్సిపల్ అధికారులు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదో అంతుచిక్కడం లేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కంప్లైంట్ చేయడం లేదా? లేక కావాలనే కొందరు అవినీతి సిబ్బందిని కాపాడుతున్నారా? అసలు ఆయా సెక్షన్‌లలో ఎలాంటి అవినీతి జరగనప్పుడు కంప్లైంట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్‌లో సిబ్బంది రెండు గ్రూపులుగా విడిపోయారని, అందులో ఓ గ్రూపు వారికి కీలక అధికారుల అండదండలు ఉండడంతో ఆడేది ఆటగా మారిందని ఆరోపణలు లేకపోలేదు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే జిల్లా స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Next Story