‘నీ హిట్లర్ పాలన అంతం అవడం ఖాయం’ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు

by Nallavelli.Anjaneyulu |

బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడవద్దని, భయపడవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి హ‌రీశ్ రావు అన్నారు.

‘నీ హిట్లర్ పాలన అంతం అవడం ఖాయం’  :  మాజీ మంత్రి  హ‌రీశ్ రావు
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడవద్దని, భయపడవద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. ఇంకో రెండేళ్లలో ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించి తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిద్దామన్నారు. మనం కోల్పోయిన అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని మరోసారి సాధించుకుందామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలన అంతం అవడం ఖాయమని కార్యకర్తలతో అన్నారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నా కష్టకాలంలో నా వెంట నిలబడి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు వారి కష్టానికి గుర్తింపుగా 127 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించి నాయకులుగా నిలబెట్టామని తెలిపారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల విజయానికి కూడా తోడుగా నిలిచామన్నారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్ రద్దుకు సంబంధించిన రిటన్ కాపీ వెంటనే ఇవ్వాలని, లేకపోతే ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక హుజూరాబాద్ నియోజకవర్గానికి ₹1,001 కోట్లు తీసుకొస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టీ జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం యొక్క ఇన్చార్జి రాకేష్ రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story