మత్తులో భవిష్యత్ చిత్తు.. యువకులు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు

by Geesa Chandu |

విద్యార్థులు, ఉన్నత చదువులు పూర్తిచేసిన యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారు.

మత్తులో భవిష్యత్ చిత్తు.. యువకులు, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి అమ్మకాలు
X

దిశ, హుజూరాబాద్ రూరల్: విద్యార్థులు, ఉన్నత చదువులు పూర్తిచేసిన యువకులు గంజాయికి అలవాటు పడుతున్నారు. మత్తులో తూలుతూ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఏ పని చేయకుండా నిత్యం మత్తులో ఉంటూ తల్లిదండ్రులను క్షోభకు గురిచేస్తున్నారు. గంజాయి కొనేందుకు సకాలంలో డబ్బులు చేతికి అందక చోరీలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. గంజాయి మత్తులో రాత్రిపూట వేగంగా బైకులు నడుపుతూ పలువురు ప్రమాదాల బారిన పడి మంచానికి పరిమితమవుతున్నారు. కొంతమంది డబ్బు ఇవ్వనందుకు ఏకంగా తల్లిదండ్రులపై దాడులకు సైతం దిగుతున్నారు. ప్రధాన పట్టణాలకే పరిమితమైన గంజాయి మత్తు ఇప్పుడు చిన్నచిన్న పట్టణాలు, మండలాలు, గ్రామాలకు సైతం పాకడం ఆందోళన కలిగిస్తోంది.

యుక్త వయసులోనే అనారోగ్యం..

గంజాయి మత్తుకు అలవాటుపడిన ఎంతోమంది యువకులు యుక్త వయసులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. మొదట సిగరెట్లకు అలవాటుపడి తర్వాత క్రమంగా గంజాయికు బానిసలవుతున్నారు. గంజాయి బానిసలు అవుతున్న వారితోపాటు గంజాయిని విక్రయించే వారు కూడా యువతే కావడం గమనార్హం. హుజూరాబాద్ పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో సిగరెట్ల ముసుగులో గంజాయి విక్రయాలు చేస్తున్నారు. హుజూరాబాద్ పట్టణ శివారులోని కొత్తగా వెలుస్తున్న కాఫీ సెంటర్లు, పాన్ షాపుల్లో ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఇక్కడికి ఎవరైనా తీసుకొచ్చి విక్రయిస్తున్నారా..? లేదా నిర్వాహకులే విక్రయిస్తున్నారా..? తెలియడం లేదు. కానీ కొంతమంది కాఫీ సెంటర్ నిర్వాహకులు, టేలాల నిర్వాహకులు మాత్రం సిగరెట్ ముసుగులో విద్యార్థులు, యువకులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు గంజాయికి బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు, యువకులలో ప్రవర్తన తీరు మారుతుండడంతో కొంతమంది తల్లిదండ్రులు సిగరెట్ ముసుగులో గంజాయి తాగుతున్నట్లు గుర్తించారు. అమ్మకందారులు మాత్రం సిగరెట్లలో కొంత భాగం ఖాళీ చేసి గంజాయి నింపుతున్నట్లు సమాచారం. ఈ సిగరెట్లను కొంతమంది సరఫరా చేసే యువకులు గంజాయి నింపి రూ.30కు ఒకటి చొప్పున అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ రీతిలో తమకు తెలియకుండానే సిగరెట్ల పేరుతో దొరుకుతున్న గంజాయి సిగరెట్లను సరదా కోసం స్నేహితులతో కలిసి తాగుతున్న విద్యార్థులు, యువకులు, పిల్లలు చివరికి గంజాయికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటుపడిన యువకులు, విద్యార్థులు కొన్ని సిగరెట్లు అమ్ముతున్న టేలాల వద్దకు వెళ్లి సగం సిగరెట్ అని చెబితే చాలు, సగం గంజాయి కలిపిన సిగరెట్లు ఇస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కళాశాలల పరిసరాల్లో..

హుజూరాబాద్ పట్టణంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలతోపాటు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కళాశాలల చుట్టూ చిన్నపాటి కాఫీ సెంటర్లు, టేలాల్లోనే గంజాయి సిగరెట్లు అమ్మకాల కలకలం రేపుతోంది. హుజూరాబాద్ పట్టణంతోపాటు కరీంనగర్, వరంగల్ రోడ్లలో వెలిసిన కాఫీ సెంటర్లలో పట్టణంలో కొన్ని టేలాలు, వైన్ షాపుల పరిసరాల్లో ఉన్న టేలాల్లో ఈ సిగరెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువగా పట్టణ శివారులోని కాఫీ సెంటర్లలో, కళాశాలల సమీపంలో ఉన్న టేలాల్లో ఈ విక్రయాలు సాగడంతో మధ్యాహ్నం, సాయంత్రం విద్యార్థులు, యువకులు సరదా కోసం ఈ సిగరెట్లు కొనుగోలు చేసి వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. సాయంత్రంవేళలో కొత్తగా వెలిసిన కాఫీ షాపులు, టేలాల్లో పెద్ద సంఖ్యలో యువకుల పోగవుతున్నారు. రోడ్లపై బైకులు, కార్లను పార్కింగ్ చేసి సిగరెట్లు, బిస్కెట్లు, టీని సేవిస్తున్నారు. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులకు ఎంతో ఇబ్బంది కలుగుతోంది.

పట్టించుకునే వారేరీ..?

గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాలకు గురైన యువకులు గంజాయి సేవించినట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. వారిని విచారించి విక్రయాలు జరుపుతున్న వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత కాలంలో గంజాయి సరఫరాపై విచారణ జరగలేదు. అనేకచోట్ల గంజాయితో పట్టుబడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. వరంగల్ నుంచి ఉప్పల్ వరకు ట్రైన్ ద్వారా గంజాయి తెస్తూ అక్కడ నుంచి ఈ ప్రాంతానికి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పోలీస్ యంత్రాంగం పక్కాగా నిఘా పెడితే విద్యార్థులు, యువకులే టార్గెట్‌గా సాగుతున్న గంజాయి రవాణాకు చెక్ పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story