- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలు : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
మహిళల సంక్షేమం కోసమే వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు.

దిశ, సుల్తానాబాద్ : మహిళల సంక్షేమం కోసమే వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్ యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు, వడ్డీ లేని రుణాల రూ. 58,86,470 / విలువ గల చెక్కుల పంపిణీ, మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ చీరలను స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ అభివృద్ధిని మరిచి పాలన కొనసాగించిందని మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించిన దాఖలాలు లేవని గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి మహిళల సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఉన్నత స్థితికి తీసుకువచ్చేలా కృషి చేశారని తెలిపారు. మహిళలకు బతుకమ్మ పేరుతో అందించిన చీరలను సోదరీమణులు ఏ ఒక్కరూ ధరించిన దాఖలాలు లేవని వారు ఇచ్చిన చీరలు ఎక్కడ కనిపించేది ప్రజలందరికీ తెలుసునని అన్నారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు గర్వంగా తలెత్తుకునేలా ఉండే చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారని అడిగినవారికి కాదనకుండా రేషన్ కార్డులను అందించారని, రైతులకు రుణమాఫీ తో పాటు సన్న వడ్లకు బోనస్ అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలోని పాత వార్డులలో రోడ్లు హైదరాబాద్ రోడ్లను తలపించేవిగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని తాము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు అందించామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను రెండు సంవత్సరాల కాలంలోనే ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వచ్చామని తెలిపారు. దేశంలోనే ఐదు లక్షల ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని అన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని మహిళా సోదరీమణులు బతుకమ్మ ఆడిన అనంతరం చెరువులో నిమజ్జనం చేసేందుకు వెళ్లే ప్రాంతాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రజలందరూ ఆశీర్వదించి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా అండగా వ్యవహరించాలన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేసి విజయకేతనం ఎగురవేయాలన్నారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు, తాసిల్దార్ బషీరోద్దీన్, మున్సిపల్ కమిషనర్ తిప్పరాజు రమేష్, పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్, బిరుదు సమత కృష్ణ, వేగోళం అబ్బయ్య గౌడ్, ఊట్ల వరప్రసాద్, అంతటి పుష్పలత, మమ్మద్ నిషాద్ రఫీక్, అమీర్ శెట్టి రాజలింగం ముత్యాల రవీందర్ గరిగే శ్రీనివాస్ కుమార్ కిషోర్ న్యాతరి శ్యాంసుందర్ సిద్ధ తిరుపతి గాదాసు రవీందర్ చింతల రాజు దున్నపోతుల రాజయ్య తొర్రికొండ ప్రభాకర్ పాల్గొన్నారు.






