- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆంధ్ర పాలనలో తెలంగాణ యాసకు, భాషకు అవమానం

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలనలో తెలంగాణ యాసకు, భాషకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపు ఇచ్చారని అన్నారు. గులాబీ జెండాపై గెలిచి పార్టీ మారిన నాయకులు వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని ఒకసారి వెళ్లిన వారు మళ్లీ పార్టీలోకి వస్తే చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు.
బీఆర్ఎస్ ను వీడిన సంజయ్ కుమార్ ఎంపీ అరవింద్ తో ఉంటున్నాడని, మరోవైపు కాంగ్రెస్ లో కూడా తిరుగుతున్నాడని, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియదన్నారు. ఎమ్మెల్యే సంజయ్ ను ప్రజలు పెన్షన్లు, ఉద్యోగాల విషయంలో నిలదీయాలని పిలుపునిచ్చారు. అమలు కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మహిళలకు ఉచిత బస్సు పథకం ఇచ్చామని చెప్తున్న.. రేవంత్ సర్కార్ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ లో పసుపు బోర్డు కు చట్టబద్ధత లేదని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత బీజెపి, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రతి గ్రామంలో ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. జగిత్యాల అంటేనే కేసిఆర్.. కేసిఆర్ అంటేనే జగిత్యాల అని మాట్లాడిన కవిత వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.