- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానేరు వాగులో అక్రమ 'టోల్' దందా.. . అధికారుల మౌనంపై అనుమానాలు
మానేరు వాగులో ఇసుక మాఫియా అక్రమ టోల్ గేట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను దోచుకుంటోంది. దేవుడి పేరుతో సాగిస్తున్న ఈ బలవంతపు వసూళ్లపై అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, కరీంనగర్ బ్యూరో: మానేరు వాగు మాఫియాలకు ఆదాయ వనరుగా మారుతుంది. ఇసుకను సులభంగా తరలించేందుకు తాత్కాలికంగా మట్టి రోడ్లను ఏర్పాటు చేస్తున్న మాఫియా ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ దందాలో అధికారులకు వాటాలు ఇచ్చేందుకు అనధికార టోల్ గేట్లు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. బలవంతపు వసూళ్లకు భక్తి ముసుగు తొడిగి టూవీలర్ కు రూ.30 రూ, 4 వీలర్ కు రూ.50 రూ ట్రాక్టర్ కు రూ.100 ల చొప్పున వసూల్ చేస్తుండటంతో మానేరు నది మీదుగా ప్రయాణించాలంటే అనధికార శిస్తు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది
ఇసుక తరలించేందుకు మానేరులో మట్టి రోడ్లు
మానేరులో నిక్షిప్తమైన ఇసుక నిల్వలను అమ్మి సొమ్ము చేసుకునేందుకు తాత్కాలిక మట్టి రోడ్లను ఏర్పాటు చేస్తున్న మాఫియా ఆపై బారికేడ్లు అడ్డుపెట్టి అటుగా వెళ్లే ప్రయాణికుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు మానేరు నదిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్న మాఫియా మానేరు పొడవునా అనధికార టోల్ గేట్లు ఏర్పాటు చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లకు భక్తి ముసుగు కప్పి రసీదులు ఇస్తూ అక్రమ దందాను అధికారిక దందాలా సాగిస్తున్నారు. అడిగే వారు లేకపోవడంతో తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేసుకుని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు మానేరు పరివాహక ప్రజలు దూర భారం తగ్గించుకునేందుకు మానేరు నది మీదుగా ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు మానేరు నదిపై ప్రయాణించాలంటే టోల్ చెల్లించక తప్పని పరిస్థితి రావడంతో స్థానికులు టోల్ దందా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
అధికారమే అవధిగా దందా
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామం నుంచి మానేరు మీదుగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లెల మధ్య మానేరు వాగులో కనగర్తి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన అక్రమ టోల్ గేట్ వివాదస్పదంగా మారింది .దేవుడి పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడటం పై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ టోల్ గేట్ ఆ గ్రామానికి చెందిన మహిళ ప్రజా ప్రతినిధి మామ సారథ్యంలో సాగుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా ప్రతినిధి బంధువు అక్రమ టోల్ గేట్ ఏర్పాటు చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడటం తో అధికారులు సైతం నోరుమెదపని పరిస్థితి నెలకొంది. అయితే బలవంతపు వసూళ్లకు గ్రామ అభివృద్ధి అంటూ దేవాలయాలు నిర్మిస్తామని వసూళ్లకు పాల్పడుతుండటం పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ దందా అధికారుల కనుసన్నల్లో జరుగుతుంది అనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
భక్తి ముసుగులో బలవంతపు వసూళ్లు
మానేరు నదిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మాఫియా ఎవరు అడ్డు చెప్పకుండా ఉండేందుకు భక్తి ముసుగు జోడించడంతో గ్రామస్తులు సైతం ఏమి మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావించిన టోల్ గేట్ నిర్వాహకులు తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసి 24 గంటలు రాత్రీ పగలు వసూళ్లకు పాల్పడుతున్నారు. అయితే ఆలయ నిర్మాణం చేపడితే భక్తుల వద్ద చందాలు సేకరించి నిర్మాణం చేపట్టాలి. కానీ ఈ బలవంతపు వసూళ్లు ఏంటి అని ప్రశ్నిస్తున్న ప్రయాణికులకు నిర్వాహకులు చెప్పే మాట మేము ఏం మా ఇంట్లోకి తీసుకుంటున్నామా దేవుడి గుడి నిర్మిస్తున్నాం. అధికారుల ఆజ్ఞ మేరకే వసూల్ చేస్తున్నాం మీరు మానేరు దాటాలి అంటే డబ్బులు చెల్లించాల్సిందే అంటూ బలవంతంగా వసూళ్లకు దిగడంతో వివాదస్పదంగా మారుతుంది
ధరలు నిర్ణయించి దర్జాగా దందా..
మానేరు నది పై అక్రమ టోల్ దందా సాగిస్తున్న మాఫియా వాహనాలకు ప్రత్యేక ధరలు నిర్ణయించి రసీదులు ఇవ్వడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టూవీలర్ కు రూ. 30 4వీలర్ కు రూ.50 ట్రాక్టర్ కు రూ.100 రూపాయల చొప్పున వసూల్ చేస్తున్న టోల్ ముఠా సమాచారం అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులే తెరచాటున ఉండి అక్రమ దందా సాగిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అక్రమ దందా పై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తం కావడం చేత కొద్ది రోజులు బందు చేసిన టోల్ గేట్ మళ్లీ ప్రారంభించడంతో ఎవరి వాటా వారికి ముట్టింది అనే చర్చ స్థానికంగా జరగడం అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం విమర్శలకు బలం చేకూరుస్తుంది.






