- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బద్ది పోచమ్మ ఆలయంలో జరుగుతున్న అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి..
శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ వసూళ్లపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు

దిశ, వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ అలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ వసూళ్లపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే వద్ద, ఇతర సేవల వద్ద ఎలాంటి రుసుముల పట్టికలు లేకుండా భక్తుల నుండి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డాడు. ఈ అక్రమాలపై దినపత్రికల్లో ఆధారాలతో సహా కథనాలు వచ్చినప్పటికీ ఆలయ అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు.
ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి..
రశీదులు లేకుండా సాగుతున్న ఈ వసూళ్లు భక్తులకు తీవ్ర ఇబ్బంది కలిగించడంతో పాటు ఆలయ ప్రతిష్టను మసకబారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ వసూళ్లపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరపాలని, కొబ్బరికాయలు కొట్టే ప్రాంతంతో పాటు ఆలయ ప్రాంగణమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భక్తుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, అధికారిక కౌంటర్లలో రశీదులతో కూడిన రుసుములను మాత్రమే వసూలు చేయాలని కోరారు. ఆలయ సేవల ధరల పట్టికలను భక్తులకు కనిపించేలా బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని, అక్రమ వసూళ్లపై తీసుకున్న చర్యలను బహిరంగపర్చి భక్తుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలని, ఆలయ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు ఈ సమస్యపై అత్యవసరంగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరాడు.






