- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడుపులోనే చిదిమేస్తున్నారు..ఆడ అని తెలిస్తే అంతే సంగతి
ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా కఠిన శిక్షలు విధించినా వైద్య మాఫియాకు ఆ చట్టాలేమి వర్తించవు. పైసలు దోచుకున్నామా.. దాచుకున్నామా.. ఎవరి ప్రాణానికి ఏమైతే మాకేంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

దిశ, గోదావరిఖని : ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా కఠిన శిక్షలు విధించినా వైద్య మాఫియాకు ఆ చట్టాలేమి వర్తించవు. పైసలు దోచుకున్నామా.. దాచుకున్నామా.. ఎవరి ప్రాణానికి ఏమైతే మాకేంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లు.. పేరుకు పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కానీ అవి మెడికల్ విభాగంలో నమోదై ఉండవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ పడావో... బేటీ బచావో అనే కార్యక్రమాలు ఎన్ని చేపట్టినా కొంతమంది వైద్యుల ధన దాహానికి అవి కనుమరుగవుతున్నాయి. డాక్టర్‌ను కనిపించే దేవుడిగా ప్రజలు మొక్కుతుంటారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది వైద్య మాఫియా అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ప్రజలకు, రోగులు చెప్పిన విధంగా అది చట్ట వ్యతిరేకమైన ఆ పని చేసి రోగులను దోచుకుంటూ కొన్ని రోజుల్లోనే రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు గోదావరిఖని పట్టణంలో నెలకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 200 అబార్షన్లు (కడుపులోనే బలవంతపు శిశు మరణాలు) అవుతున్నాయి. అనధికారకంగా ఇంకెన్ని అవుతున్నాయో ఎవరికీ తెలియదు. ఒక మహిళకు అబార్షన్ చేయాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కానీ ఒక్క ఆస్పత్రి కూడా నిబంధనలను పాటించడం లేదు. పెద్దపల్లి జిల్లాలో ఒక నెలలో సుమారు 1000మంది మహిళలు గర్భం దాల్చినట్లు ప్రభుత్వ లెక్కల్లో నమోదవుతుంటే సుమారు 800మంది మాత్రమే డెలివరీ అవుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇంకా 200 గర్భాలు అబార్షన్లు అవుతున్నాయని కూడా ప్రభుత్వ లెక్కలే తెలుపుతున్నాయి. కానీ కడుపులోనే బలవంతంగా శిశువును చంపాల్సిన అవసరమేంటో మాత్రం ప్రభుత్వానికి ఆస్పత్రులు తెలపడం లేదు. స్కానింగ్ చేసి ఆడ, మగ అనే విషయాన్ని తెలపడంతో ఆడ శిశువు అని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారని మహిళా రక్షణ సామాజిక కార్యకర్తలు వాపోతున్నారు. ఒక అబార్షన్ చేయాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. మూడు నెలల గర్భం తీయాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక గైనకాలజిస్ట్, సుమారు నాలుగు నెలల గర్భం తీసివేయాలంటే ఇద్దరు గైనకాలస్టులు, ఆరు నెలల గర్భం తీయాలంటే మెడికల్ బోర్డు అనుమతి పొందాలి. కానీ పెద్దపల్లి జిల్లాలో అలా జరగదు.
అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు...
పెద్దపల్లితో పాటు గోదావరిఖని పట్టణంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు డిస్ట్రిక్ట్ మెడికల్ కార్యాలయంలో నమోదు కాకుండానే మెడికల్ మాఫియా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆ స్కానింగ్ సెంటర్లలో ఎలాంటి చట్ట వ్యతిరేక పనులనైన పైసలు పడేసి వారికి కావాల్సింది తెలుసుకుంటున్నారు. గోదావరిఖనిలో అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్ వాడుతున్నారని సమాచారంతో జిల్లా మెడికల్ ఆఫీసర్స్ తనిఖీకి వచ్చినప్పుడు మెడికల్ మాఫియా అడ్డుకుని అధికారులపైనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి. ఇలా కొంతమంది ధన, రాజకీయ బలంతో ఇలా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
ఆడ శిశువులనే అనుమానాలు...
స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల మాఫియా వల్లనే ఈ అబార్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ధన దాహంతో కొంతమంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఆడ, మగ అనే విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు. దీంతో స్కానింగ్‌లో ఆడ శిశువు అనగానే చట్టానికి వ్యతిరేకంగా వైద్య మాఫియా అబార్షన్లను చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇలాంటి వైద్య మాఫియా చేతుల్లో చిక్కుకొని రూ.లక్షలు కొల్లగొట్టుకుంటున్నారు.
అక్రమాలకు అడ్డాగా ఆ ఆస్పత్రులు...
జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమాలు చేయడంలో ఘనపాటి. ఎలాంటి పని కావాలన్నా ఫలానా ఆస్పత్రికి వెళ్లు నీ పని అవుతుందని చెప్ప గలిగే ప్రైవేటు ఆస్పత్రులు పెద్దపల్లి జిల్లాలో కోకొల్లలు ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లుగా పట్టణాలలో పెద్దపెద్ద ప్రైవేటు ఆస్పత్రులుగా చెలామణి అవుతున్నా ఇప్పటివరకు జిల్లా మెడికల్ ఆఫీసులో నమోదు చేసుకోలేదంటే ఎంత పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవుతుంది.
దిశ స్పెషల్ ఇన్వెస్టిగేషన్..
జిల్లాలో నడుస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల తీరును తెలుసుకుందామని దిశ దిన పత్రిక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెళ్లగా కళ్లు తిరిగే నిజాలు వెల్లడయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల నియమ నిబంధనలు ఏమిటని అడుగగా అధికారులు తెలిపిన నిబంధనల ప్రకారం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు మచ్చుకు ఒక్కటి కూడా కనపడలేదు. అంటే మెడికల్ నిబంధనల ప్రకారం ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్న యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిపించడం లేదని అర్థమవుతుంది. మెడికల్ అధికారులు ప్రజల ప్రాణాల కాపాడడం కోసం ప్రైవేటు మెడికల్ ఆస్పత్రుల మాఫియాను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూ.కోట్లకు పడగలెత్తుతున్న మాఫియా...
ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి ప్రజలు, రోగులను నిత్యం దోచుకుంటూ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ప్రభుత్వ లోసుగులు, అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో మాఫియా చేసింది వైద్యం అన్నట్లుగా పరిస్థితి మారింది.
పట్టించుకోని సంబంధిత అధికారులు..
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అడ్డుకునే ప్రభుత్వ అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడితే ఇంకేముంటుంది. ప్రైవేటు ఆస్పత్రుల మాఫియా చెప్పిందే రోగం.. చేసిందే వైద్యం అన్నట్లుగా ఉంది. ప్రతి దినం జిల్లాలో ఎక్కడో ఒక్కచోట ప్రైవేటు ఆస్పత్రుల్లో మోసాలపై రోగుల బంధువులు తిరగబడుతూనే ఉన్నారు. సంబంధిత అధికారులు ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి మోసాలకు తావు లేకుండా ఉంటుంది కదా అని ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.
లింగ నిర్ధారణ నేరం..
లింగ నిర్ధారణ పరీక్షలు ఆస్పత్రుల్లో చేయొద్దు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచి ఆ ఆస్పత్రులపై చట్ట పరిధిలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రులలో రోగులకు సరైన వైద్యం అందలేదని ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అబార్షన్ అయిన జిల్లా కార్యాలయంలో పూర్తి వివరాలను తెలియచేయాలి. పెద్దపల్లి జిల్లాలో గర్భధారణ, డెలివరీ, అబార్షన్ల లెక్కలలో చాలా తేడాలు ఉన్నాయి. మేము ఎప్పటికప్పుడు ఆస్పత్రులను తనిఖీ చేసి అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లను సీజ్ చేసి కేసులు పెడుతున్నాం.
- అన్నప్రసన్న, డీఎంహెచ్ఓ, పెద్దపల్లి జిల్లా






