- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూరాబాద్ సమ్మక్క ‘జాతర’ లో పాత కక్షల సెగ
హుజూరాబాద్ పట్టణంలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. సమ్మక్క-సారలమ్మ జాతర వేదికగా మొదలైన వివాదం ప్రభుత్వ ఆసుపత్రి వరకు పాకి రణరంగంగా మారింది.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. సమ్మక్క-సారలమ్మ జాతర వేదికగా మొదలైన వివాదం ప్రభుత్వ ఆసుపత్రి వరకు పాకి రణరంగంగా మారింది. యువకుల మధ్య జరిగిన ఈ దాడుల్లో పలువురికి గాయాలు కావడమే కాకుండా ఆసుపత్రి అద్దాలు ధ్వంసమవ్వడం కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో పాత కక్షల నేపథ్యంలో యువకుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఒడ్డెర కాలనీకి చెందిన సిద్ధార్థ అనే యువకుడిపై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన సిద్ధార్థను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిద్ధార్థ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బుడిగే జంగాల కాలనీకి చెందిన కొందరు యువకులు ఒక్కసారిగా ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చారు. అక్కడ ఉన్న మహేష్ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ఈ గొడవతో ఆసుపత్రి ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. యువకులు రాళ్లతో దాడి చేసుకోవడంతో ఆసుపత్రి కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. చికిత్స పొందుతున్న రోగులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
రంగంలోకి దిగిన పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే హుజూరాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఘర్షణ పడుతున్న యువకులను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. "శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రాంతాల్లో దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిందితులను రిమాండ్‌కు తరలిస్తాం."అని టౌన్ సిఐ కరుణాకర్ తెలిపారు. ఈ గొడవలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. పాత కక్షలే ఈ దాడులకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






