హిందువులంతా ఏకతాటిపై.. కరీంనగర్ లో రేపు హిందూ ఏక్తా యాత్ర..

by Bhanu |   (  Updated:2025-05-21 15:57:29  IST  )

హిందూ సంఘటిత శక్తిని చాటడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రేపు కరీంనగర్ లో నిర్వహిస్తున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హిందువులంతా ఏకతాటిపై.. కరీంనగర్ లో రేపు హిందూ ఏక్తా యాత్ర..
X

దిశ బ్యూరో, కరీంనగర్ : హిందూ సంఘటిత శక్తిని చాటడమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రేపు కరీంనగర్ లో నిర్వహిస్తున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పెహల్గాం ఘటన నేపథ్యంలో దేశ ప్రజలంతా సంఘటితమై ఉగ్రవాద నిర్మూలనకు ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందువుల్లో ఐక్యతా భావం నెలకొంది. ఈ నేపథ్యంలో రేపు నిర్వహించే ‘హిందూ ఏక్తా యాత్ర’కు వేలాదిగా జనం తరలివచ్చే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ‘హిందూ ఏక్తా యాత్ర’ 22న సాయంత్రం 4 గంటలకు వైశ్యాభవన్ నుండి మొదలై రాత్రి పొద్దుపోయేదాకా కరీంనగర్ సిటీలోని ముఖ్య కూడళ్ల మీదుగా సాగుతూ తిరిగి వైశ్యా భవన్ వద్ద ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి పొద్దుపోయేదాకా ఆయా కూడళ్ల మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ హిందుత్వ వాదుల్లో జోష్ నింపనుంది. వివిధ సాంస్క్రుతిక, కళారూపాల ప్రదర్శనతోపాటు పెహల్గాం ఘటన నేపథ్యంలో భారత సైన్యం ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ‘ఏక్తా యాత్ర’ కొనసాగనుండటం విశేషం.

హిందువులను ఏకం చేసేందుకు ఆనాడు గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన బాల గంగాధర తిలక్ స్పూర్తితో బండి సంజయ్ కుమార్ కరీంనగర్ వేదికగా గత 15 ఏళ్లుగా ప్రతి ఏటా హనుమాన్ జయంతి నాడు ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా గత ఏడాది హిందూ యాత్ర నిర్వహించలేదు. రెండేళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఏక్తా యాత్రకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే దాదాపు 50 వేల మంది ఈ యాత్రలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇతర జిల్లాల నుండి సైతం బండి సంజయ్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు, హిందుత్వ వాదులు ఈ యాత్రలో పాల్గొనే అవకాశాలున్నాయి.

రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లోని హిందువులను ఏకం చేయడంతోపాటు హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే వారంతా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈసారి ఉమ్మడి కరీంనగర్ లోని వివిధ కుల సంఘాలు, వ్రుత్తి సంఘాలు, కార్మిక, ధార్మిక సంఘాల నాయకులు సైతం ఏక్తా యాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన ‘హిందూ ఏక్తా యాత్ర’ పోస్టర్ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులంతా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్, ప్రముఖ సంఘసేవకులు, వక్త అప్పాల ప్రసాద్ జీ ఏక్తా యాత్రలో పాల్గొని ప్రసంగిస్తారు.

వాస్తవానికి బండి సంజయ్ ఏక్తా యాత్ర ప్రాముఖ్యాన్ని తగ్గించేందుకు అనేక మంది ఏక్తా యాత్రలు నిర్వహించారు. అయితే అంతగా సఫలం కాలేదు. బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర కు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తుండటం, కరీంనగర్ ప్రజలంతా ఈ యాత్రను తిలకించేందుకు ఎదురు చూడటం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో హిందూ ఏక్తా యాత్ర చాంపియన్ గా బండి సంజయ్ అవతరించారు. ఈసారి కనీవినీ ఎరగని రీతిలో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ ను జయప్రదం చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు నిర్వహిస్తున్న హిందూ ఏక్తా యాత్రకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story