పేపర్ లీకేజీ కేసులో అతడిని కూడా విచారించాల్సిందే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
పేపర్ లీకేజీ కేసులో అతడిని కూడా విచారించాల్సిందే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ను కూడా విచారించాల్సిందేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. స్థానిక ఇందిరా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీకేజీ లో సిట్ నిష్పక్షపాతంగా విచారణ చేపడుతోందని ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ద్వారానే టీ.ఎస్.పీ.ఎస్.సీ తాటిపల్లికి చెందిన రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం పొందాడని తెలిపారు.

మంత్రి కేటీఆర్ ఇటీవల సిరిసిల్లలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో గ్రూప్-1 లో వందకు పైగా మార్కులు ఒక్కరికీ మాత్రమే వచ్చాయని అన్నారని కానీ, సిట్ విచారణలో 30 మందికి పైగా వచ్చాయని ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంటే నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్నారు.

నేడు నేను ప్రశ్నిస్తే రేపు నాకు కూడా నోటీసులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. టీ.ఎస్.పీ.ఎస్.సీలో ఆంధ్ర ఉద్యోగి డిప్యూటేషన్ మీద ఎలా వచ్చారని అసలు టీ.ఎస్.పీ.ఎస్.సీ సభ్యుల నియామకమే రాజకీయ నియామాకమని విమర్శించారు. పదో తరగతి పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ పరిణామం ప్రశ్నించే వారిని అనగదోక్కడమేనని, అసలు పది ప్రశ్నాపత్రాల లీకేజీలో బండి సంజయ్ కి సంబంధం ఉందా లేదా అనే విషయం సాక్ష్యాధారలతో సహా ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బండి సంజయ్ పేపర్ లీక్ చేశాడని ఆరోపిస్తున్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. ఇదంతా చూస్తుంటే టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ మీద ఆరోపణలు వస్తున్నందుకు.. ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే బండి సంజయ్ అరెస్ట్ తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు నాగభూషణం, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, నాయకులు కళ్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, చాంద్ పాషా, రాధ కిషన్, నెహాల్, పూర్ణ చందర్ రెడ్డి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed