- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మికుంట కేంద్రంగా అక్రమ గుట్కా దందా!
నిషేధిత గుట్కా, అంబర్ ఉత్పత్తుల అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మికుంట పట్టణం ఈ అక్రమ స్మగ్లింగ్ దందాకు ప్రధాన కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు, ప్రజల ఆరోగ్యానికి పూర్తి విరుద్ధంగా సాగుతున్న ఈ 'జీరో దందా' వెనుక ఒక పటిష్టమైన అక్రమ నెట్‌వర్క్ పనిచేస్తుందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

దిశ, జమ్మికుంట టౌన్: నిషేధిత గుట్కా, అంబర్ ఉత్పత్తుల అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో జమ్మికుంట పట్టణం ఈ అక్రమ స్మగ్లింగ్ దందాకు ప్రధాన కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు, ప్రజల ఆరోగ్యానికి పూర్తి విరుద్ధంగా సాగుతున్న ఈ 'జీరో దందా' వెనుక ఒక పటిష్టమైన అక్రమ నెట్‌వర్క్ పనిచేస్తుందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మికుంట నడిబొడ్డున ఉన్న హోల్‌సేల్ దుకాణలలో ఈ గుట్కా, అంబర్ అక్రమ వ్యాపారాలకు ప్రధాన అడ్డాగా మారిందనేది స్థానికుల ఆరోపణలు లేకపోలేదు. స్టేషనరీ, జనరల్ స్టోర్ ముసుగులో నిషేధిత ఉత్పత్తులను భారీ స్థాయిలో నిల్వ ఉంచి పట్టణంతో పాటు మండలంలోని ఇతర గ్రామాలకు స్మగ్లింగ్ చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
పన్ను ఎగవేత, స్మగ్లింగ్
ఈ గుట్కా స్మగ్లింగ్ నెట్‌వర్క్ కేవలం నిషేధిత ఉత్పత్తుల అమ్మకాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతోంది.హోల్‌సేల్ అమ్మకాలకు అత్యంత కీలకమైన పన్ను రసీదులు (బిల్లులు) ఇవ్వకుండానే ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. దీని ద్వారా కోట్లాది రూపాయల జీఎస్టీని ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నారు. ఇది స్పష్టమైన జీఎస్టీ ఉల్లంఘన.ఈ హోల్‌సేల్ వ్యాపారి కేవలం తమ దుకాణానికి పరిమితం కాకుండా జమ్మికుంట మండలంలోని చిరు దుకాణదారులతో మొబైల్ గ్రూపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా రహస్యంగా ఆఫర్లు, ధరలను పంపిస్తూ గుట్కా, అంబర్ వస్తువులను హోల్‌సేల్‌గా సరఫరా చేస్తున్నారు. అంటే గుట్టుగా సాగాల్సిన స్మగ్లింగ్ దందా ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లా విస్తరించింది.
పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా
గతంలో జరిగిన దాడుల్లో గుట్కాను పెద్ద మొత్తంలో డీసీఎం, కార్లలో తీసుకువచ్చి చిన్నచిన్న దుకాణాలకు రాత్రివేళల్లో సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాల గుట్కా దందా వెనుక పెద్ద ముఠాలే ఉన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి ఈ నిషేధిత సరుకును అక్రమంగా తీసుకువస్తున్నట్లు కూడా సమాచారం.గుట్కా, అంబర్ వంటి నిషేధిత ఉత్పత్తులతో పాటు, ఈ వ్యాపారులు అమాయక పిల్లల ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు బింగో, కురుకురే, చాక్లెట్ వంటి ప్యాక్ చేసిన ఆహార వస్తువులను కూడా తయారీ తేదీ గడువు తేదీ వంటి ముఖ్య వివరాలు లేకుండానే మండలంలోని గ్రామాలన్నింటికీ రవాణా చేసి విక్రయిస్తున్నారు.
అనారోగ్యాల బారిన చిన్నారులు...
గడువు ముగిసిన లేదా నాణ్యత లేని ఈ వస్తువులను తిని పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకర్షణీయమైన బొమ్మలు, రంగురంగుల డిజైన్‌లతో పిల్లలను ఆకర్షించి వారి ఆరోగ్యంతో ఈ వ్యాపారులు చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
అధికారుల 'మౌనం'పై ఆరోపణలు...
నిషేధిత గుట్కా స్మగ్లింగ్ ,జీఎస్టీ ఎగవేత బాలల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల విక్రయాలు ఇంత నిరాటంకంగా సాగడానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. గతంలో దాడులు జరిగినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడం వెనుక సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. అధికారులు తనిఖీలకు వస్తున్నట్లు గుట్కా వ్యాపారులకు ముందుగానే సమాచారం అందుతోందని అందుకే తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయనే వాదనలు బలంగా ఉన్నాయి.గుట్కా స్మగ్లింగ్ దందాతో ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని పణంగా పెడుతున్న దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీఎస్టీ అధికారులు, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ వ్యవస్థీకృత స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో సహా పెకిలించి, 'జీరో దందా'కు శాశ్వతంగా తెరదించాలని ప్రజలు కోరుకుంటున్నారు.గుట్కా స్మగ్లింగ్ వ్యవహారంపై యజమానులు వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానాన్ని దాటవేశారు.






