ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

by Ratna Kumari |

జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక‌ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక‌ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో రబీ ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొన్ని షరతుల వల్ల ధాన్యం సేకరణ ఆలస్యమైందన్నారు. జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం.. తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తూకం విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మిల్లర్లు నష్టపోకుండా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందని ఈ సమస్యను అధిగమిస్తూ మిల్లర్లు తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఎక్కడైనా కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తితే రైతులు రోడ్డు ఎక్కకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని అవసరమైతే పోలీస్ అధికారులు చొరవ చూపాలన్నారు. ఖరీఫ్ ధాన్యం విషయంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల జిల్లాకు లక్ష 80 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను తీసుకునే విధంగా తాను చొరవ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మిల్లర్లకు గుర్తు చేశారు. ‌ కొందరు కావాలనే రోడ్డు ఎక్కి ప్రభుత్వాన్ని మిల్లర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అయితే కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేలా అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 70 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేశామని కొనుగోళ్లలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీతో పాటు జిల్లాలోని చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులు, ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.

Next Story