వడ్ల కొనుగోలు చేయడంలో ప్రభుత్వ విఫలం

by Ratna Kumari |

రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలం అయింద‌ని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ప్రభుత్వం పై మండిపడ్డారు.

వడ్ల కొనుగోలు చేయడంలో ప్రభుత్వ విఫలం
X

దిశ, మంథని : రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలం అయింద‌ని రాష్ట్ర బీజేపీ శ్రేణులు ప్రభుత్వం పై మండిపడ్డారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ చేపట్టిన “రైతు గోస- బీజేపీ భరోసా” పర్యటనలో భాగంగా బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీలు ఈటల రాజేందర్,రఘునందన్ రావు, ఎమ్మెల్యే లతో కలిసి ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో లక్షలాది క్వింటాళ్ల ధాన్యం ఇప్పటికీ కుప్పలుగా పేరుకుపోయి ఉందని పేర్కొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన రైతులపై కాటారం ప్రాంతంలో అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. దీంతో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియలను వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Next Story