డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే

by Kodari Anjali |

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

డ్రగ్స్ రహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు ఎస్పీ చంద్రయ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పద్మనాయక కల్యాణ మండపం వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాలలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రదర్శనలు నిర్వహించి ఆకట్టుకున్నారు. "సే నో టు డ్రగ్స్ – సే యెస్ టు లైఫ్", "పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట" వంటి నినాదాలతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన స్టాళ్లను అతిథులు పరిశీలించారు.

డ్రగ్స్‌కు బానిస కాకుండా....

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తు అని, డ్రగ్స్‌కు బానిస కాకుండా తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డీ-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం అందుబాటులో ఉందని, డ్రగ్స్ వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. జిల్లాను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, ఎస్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ మహేష్, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story