- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

దిశ, గంగాధర : రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అంగన్ వాడీల కేంద్రాల పని తీరును ఆధునికీకరించేందుకు ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్‌ఫోన్లు సేవల మెరుగుదలకు కీలకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం గంగాధర మండలం మధురనగర్‌లోని ప్రజా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని 140 మంది అంగన్ వాడీ టీచర్లకు ఎమ్మెల్యే స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల్లో సిబ్బంది హాజరు నమోదు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాల నమోదు, సేవల పర్యవేక్షణ వంటి అంశాలను ఆన్ లైన్ ద్వారా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడతాయని తెలిపారు. అంగన్ వాడీ టీచర్లు ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక సదుపాయాలను సమర్థంగా వినియోగిస్తూ సేవల పారదర్శకతను పెంచాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులకు అందుతున్న సంక్షేమ సేవలు మరింత వేగంగా చేరేందుకు ఈ చర్య దోహదపడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర ప్రాజెక్టు సీడీపీవో సల్వాజి నర్సింగారాణి, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, అంగన్ వాడీ సూపర్ వైజర్లు సంతోషి, రేణుక, సుధారాణి, మస్రత్, మిషన్ వాత్సల్య, సామాజిక కార్యకర్త కవితాదేవి తదితరులు పాల్గొన్నారు.






