సిరిసపల్లిలో చెత్త ప్లాంట్ అంటే.. అది 'చెత్త నుంచి చితి'కి దారితీయడమే

by Ratna Kumari |

"హుజురాబాద్ గడ్డపై నిర్మించ తలపెట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.. అది చెత్త నుంచి విద్యుత్తును ఇచ్చే కేంద్రం కాదు. ప్రజల పాలిట 'చెత్త నుంచి చితి'గా మారబోతోంది" అని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు ఆవేదన వ్యక్తం చేశారు.

సిరిసపల్లిలో చెత్త ప్లాంట్ అంటే.. అది చెత్త నుంచి చితికి దారితీయడమే
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : "హుజురాబాద్ గడ్డపై నిర్మించ తలపెట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.. అది చెత్త నుంచి విద్యుత్తును ఇచ్చే కేంద్రం కాదు. ప్రజల పాలిట 'చెత్త నుండి చితి'గా మారబోతోంది" అని హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్, విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన శిబిరంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

పసిపిల్లల ప్రాణాలతో వ్యాపారమా..?

​అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని బలిపెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వేల టన్నుల విషపూరిత చెత్తను కాల్చడం వల్ల విడుదలయ్యే డయాక్సిన్లు, ఫ్యూరాన్లు వంటి వాయువులతో ఈ ప్రాంతం క్యాన్సర్ గడ్డగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే పసిపిల్లల ఊపిరితిత్తులను చిద్రం చేసే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని వారు మండిపడ్డారు.

​భూగర్భ జలాలు విషతుల్యం..

​బంగారు పంటలు పండే సిరిసపల్లి ప్రాంతంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తే వ్యవసాయం నాశనమవుతుందని ఆయన హెచ్చరించారు. చెత్తలోని రసాయనాలు భూమిలోకి ఇంకి బావులు, బోర్లను విషతుల్యం చేస్తాయని అన్నారు. పశువులు కలుషిత నీరు తాగి మృత్యువాత పడే ప్రమాదం ఉందన్నారు. పచ్చని పొలాలను పాడుచేసి, ప్రజల ఉసురు పోసుకునే అభివృద్ధి తమకు వద్దని ఆయన తెగేసి చెప్పారు. "మనం ఈరోజు మేల్కోకపోతే, రేపు మన సమాధుల మీద ఈ చెత్త ప్లాంట్లు నిలబడుతుందని అన్నారు .

పల్లెలేం పాపం చేశాయి?

​పట్టణాల్లోని చెత్తను తెచ్చి పల్లెలపై రుద్దడంపై నిరసన కారులు తీవ్ర వివక్ష వ్యక్తం చేశారు. సిరిసపల్లిని జిల్లాకే ఒక 'చెత్త కుప్ప'గా మార్చాలని చూడటం దుర్మార్గమని, ఈ ప్రాంత ప్రజలంటే పాలకులకు అంత చులకనా అని నిలదీశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాల గోడలు బద్దలు కొట్టి ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్లాంట్ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాయిత రాములు హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే ప్లాంట్ గోడలను బద్దలు కొట్టడానికి కూడా వెనకాడబోమని, ఇది అస్తిత్వ పోరాటమని సభికులు పిడికిలి బిగించి నినదించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బాధితులు, రైతులు,యువత పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కామని రవీందర్, సీనియర్ పాత్రికేయులు కోరం సుధాకర్ రెడ్డి, గడ్డం ధర్మారెడ్డి ,మాక్సుద్, నంబి భరణి కుమార్ ,కేదాసి శ్రీధర్, చిలకమారి సత్యరాజ్, పబ్బ తిరుపతి, పరాంకుశం కిరణ్ కుమార్, యాదగిరి, నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, ముష్క శ్రీనివాస్,ఫహిం, ఎడ్ల కుమార్, కేశబోయిన స్వామి, సాగర్ ,పడాల రమేష్, మచ్చిక చందు ,రాజు,బాబు, శ్రీనివాస్,ఇమ్రాన్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Next Story