​హుజురాబాద్ మాజీ ZPTC పడిదం బక్కారెడ్డి మృతి

by velandi.Saikiran |

హుజురాబాద్ మాజీ జడ్పిటిసి సభ్యులు, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు పడిదం బక్కారెడ్డి కన్నుమూశారు.

​హుజురాబాద్ మాజీ ZPTC పడిదం బక్కారెడ్డి మృతి
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మాజీ జడ్పిటిసి సభ్యులు, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు పడిదం బక్కారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామం, టీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ​​హుజురాబాద్ మాజీ జడ్పిటిసి బక్కారెడ్డి గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అప్పటి నుండి ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో, గత పది రోజుల క్రితం వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పడిపోయారు.

వెంటనే కుటుంబ సభ్యులు... ఆయనను కరీంనగర్‌లోని ఒమేగా హాస్పిటల్ కు తరలించి అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ, చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ​బక్కారెడ్డి సుమారు 20 సంవత్సరాల క్రితం హుజురాబాద్ సింగిల్ విండో అధ్యక్షులుగా పనిచేశారు. కందుగులకు సర్పంచ్‌గా, ఎంపిటిసి సభ్యునిగా కూడా సేవలందించారు. ఆయన భార్య ప్రభావతి కూడా తాజా మాజీ సర్పంచ్‌గా పనిచేయడం విశేషం. ​బక్కారెడ్డి.... బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి తన వంతు కృషి చేశారు.

​శోకసంద్రంలో బంధువులు, గ్రామస్తులు...

బక్కారెడ్డి మృతి పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ఆయ‌న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయారు. బక్కారెడ్డి భౌతిక కాయాన్ని కరీంనగర్ నుంచి కందుగుల గ్రామానికి తరలించనున్నారు. ఆయన అంత్యక్రియలు రేపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Next Story