కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి

by Kodari Anjali |

కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలి నీలాందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలి: మాజీ మంత్రి
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయాలి నీలాందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయడం ఒక్కటే మార్గమని నాయకుడు పేర్కొన్నారు. ​కన్నెపల్లి మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని కోరుతూ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం, ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లేఖ రాశారు. తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో పెట్టాలని, వారిని బొక్కలో వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.​ దశాబ్దాల కాలంగా ఇరిగేషన్ శాఖలో పనిచేసి, రాష్ట్ర పరిస్థితులపై అవగాహన ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు రైతుల పక్షాన ఇచ్చిన మంచి సలహాలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకోలేదని విమర్శించారు.​ ఒక బాధ్యత గల ప్రభుత్వం అయితే నీటిని లిఫ్ట్ చేయడం సాధ్యమా కాదా అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలి లేదా సంబంధిత అధికారులతో మాట్లాడించాలి, కానీ దాన్ని వదిలేసి సలహాలు ఇచ్చిన వారిపై ఇష్టానుసారంగా మాట్లాడడం ముఖ్యమంత్రి అహంకారానికి నిదర్శనమని ఆరోపించారు.

ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల కంటే..

నదిలో దాదాపు 98 టీఎంసీల నీరు వృథాగా కొట్టుకుపోతోందని, ఆ రోజు తాము స్పష్టంగా చెప్పినట్లుగా మేడిగడ్డ దగ్గర గేట్లు వేయకుండా, నీటిని ఆపకుండానే అక్కడ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి నీటిని పంప్ చేయవచ్చని నాయకుడు వివరించారు.​ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, పనికిరాదని, లక్ష కోట్లు మునిగిపోయాయని ఈ ప్రభుత్వం ప్రచారం చేసిందని,ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే తాము చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోతుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఇష్టపడడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల కంటే రైతుల పరిస్థితి ముఖ్యమని, పంటలు వేయాలో వద్దో తెలియక, దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఆలోచిస్తోందని, వారికి ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 7 జిల్లాల్లోని దాదాపు 40 లక్షల ఎకరాలకు నీరందించాలనే ముందుచూపుతో, కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకే కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారని, అక్కడ గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని గుర్తుచేశారు.​ NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) రిపోర్టు ప్రకారం దీన్ని రిపేర్ చేయవచ్చని, అసెంబ్లీలో కూడా హరీష్ రావు, కేటీఆర్ దీనిపై అనేకసార్లు మాట్లాడారని తెలిపారు.

పంటలకు నీళ్లు ఎప్పుడు ఇస్తారు?" అని ప్రశ్నిస్తే..

మేడిగడ్డ బ్యారేజీలో కుంగింది ఒకే ఒక పిల్లర్ అని, దానికి సంబంధించిన 7వ బ్లాక్ మొత్తాన్ని తీసేసి పునర్నిర్మించినా రూ. 300 నుండి రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, ఆ నిర్మాణాన్ని చేపట్టిన L&T సంస్థే ఉచితంగా రిపేర్ చేయడానికి ముందుకు వచ్చి ముఖ్యమంత్రికి చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాయకుడు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ప్రస్తుతం చాలా ఆవేదనతో ఇబ్బందులతో ఉన్నారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో ఇరిగేషన్ ఇంజనీర్లు, జర్నలిస్టులు, అనేక మంది శక్తులు కలిసి పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ నేడు వారిని కనీసం గౌరవించే సంస్కృతి ఈ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ "పంటలకు నీళ్లు ఎప్పుడు ఇస్తారు?" అని ప్రశ్నిస్తే... "వాళ్లను కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయి" అనేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, ఇంత తర్కశూన్యంగా, మూర్ఖంగా దుర్మార్గంగా మాట్లాడిన ముఖ్యమంత్రిని తామెప్పుడూ చూడలేదని నాయకుడు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమం లో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, ముత్యాల బలరాం రెడ్డి, ఏలేటి కృష్ణ రెడ్డి‌ పాల్గొన్నారు.

Next Story