పిల్లల తల్లిదండ్రులుకు BIG అలర్ట్.. రేపటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. ఈ తప్పు అస్సలు చేయకండి

by Prasad Jukanti |

తెలంగాణలో సోమవారం 96 లక్షల మంది చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ దీనిని ప్రారంభించనున్నారు.

పిల్లల తల్లిదండ్రులుకు BIG అలర్ట్.. రేపటి నుంచి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.. ఈ తప్పు అస్సలు చేయకండి
X

దిశ, తెలంగాణ బ్యూరో /డైనమిక్ బ్యూరో: పిల్లల్లో నులిపురుగుల (నట్టలు) సమస్యను నివారించేందుకు సోమవారం (జూలై 13) రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీకి తెలంగాణ ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఆరోగ్య శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు అల్బెండాజోల్ మాత్రలు వేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే రోజు(జూలై 13, సోమవారం) కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జూలై 13న ఏ కారణంతోనైనా మాత్ర వేయించుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న మాప్-అప్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా మాత్ర వేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

స్కూళ్లు, కాలేజీలు, అంగన్ వాడీ సెంటర్లలో:

1 నుంచి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ ఆల్బండజోల్ మాత్ర తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. పిల్లల్లో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయని మంత్రి వివరించారు. ఈ సమస్యల కారణంగా చదువుపై పిల్లల శ్రద్ధ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. నులిపురుగులు బయటకు కనిపించకపోయినా పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఆల్బండజోల్ వేయించాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, అంగన్‌వాడీ సెంటర్లలో సోమవారం నాడు ఆల్బండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఈ సమాచారాన్ని పిల్లల తల్లిదండ్రులందరికీ షేర్ చేయాలని మంత్రి ప్రజలను కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం మాత్రలు వేయడంతోనే ముగిసిపోదని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన తాగునీరు ఉపయోగించడం, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగి తినడం వంటి మంచి అలవాట్లపై కూడా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు.

ఖాళీ కడుపుతో ట్యాబ్లెట్లు వద్దు:

అల్బెండాజోల్ మాత్రల ద్వారా నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఈ మాత్ర వల్ల నులి పురుగుల సమస్య తొలగిపోయి పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి బాగా అందుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతాయని ఆమె వివరించారు. ఆల్బండజోల్ ట్యాబ్లెట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని సంగీత వెల్లడించారు. పాఠశాలకు వెళ్లని పిల్లలను ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకులు గుర్తించి సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకొచ్చి మాత్ర వేయిస్తారని తెలిపారు. ట్యాబ్లెట్లను ఇంటి వద్దకు తీసుకెళ్లవద్దని, నిపుణుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈ ట్యాబ్లెట్‌ వేసుకోవాల్సి ఉంటుందని తల్లిందండ్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ట్యాబ్లెట్ వేయించడానికి ముందు పిల్లలకు తప్పనిసరిగా ఆహారం తినిపించాలని, ఖాళీ కడుపుతో ట్యాబ్లెట్ వేయించొద్దన్నారు.

వయస్సును బట్టి మాత్ర మోతాదు:

• 1–2 సంవత్సరాలు: సగం ట్యాబ్లెట్‌.. నీళ్లలో కలిపి ఇవ్వాలి.

• 2–3 సంవత్సరాలు : ఒక మాత్రను నీళ్లలో కలిపి ఇవ్వాలి.

• 3–19 సంవత్సరాలు : ఒక మాత్రను బాగా నమిలి మింగాలి.

Next Story