- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం పై సీఎం అబద్దాలు.. హరీశ్ రావు విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లోని కురిక్యాల సమీపంలోని వరద కాలువను పరిశీలించారు.

దిశ, గంగాధర : కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ అబద్దాలు చెబుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లోని కురిక్యాల సమీపంలోని వరద కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. వరద కాలువలో ప్రవహిస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినవేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తిపోతల చేస్తూనే.. అది లేదని సీఎం చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని హరీశ్ రావు విమర్శించారు. వరద కాలువ ఆధారంగా సాగుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లతోనే పండుతున్నాయని తెలిపారు.
కాళేశ్వరం అంటే కేవలం ఒక నిర్మాణం కాదని, మూడు బ్యారేజీలు, వందకు పైగా భాగాలతో కూడిన మహత్తర ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో పసిడి పంటలు పండుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం లేకుండానే రాష్ట్రంలో అత్యధిక పంటలు పండించామని సీఎం చెప్పడం అబద్ధమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అపప్రధకు గురిచేయడానికి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు అందించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తికాలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం దానిపై రూ.2052 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిందని తెలిపారు. మిడ్ మానేర్ ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత భాగం మాత్రమే పనులు చేపట్టగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1526 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిందన్నారు. వరద కాలువ పునరుజ్జీవన పథకం కింద సుమారు రూ.2000 కోట్లతో పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 96 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, మిగిలిన 4 శాతం పనులు కూడా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని విమర్శించారు. గత రెండేళ్లలో ప్రభుత్వం ఏ ఒక్క కొత్త ప్రాజెక్టును పూర్తి చేయలేదని, ఇప్పటికే 70 నుంచి 80 శాతం పనులు పూర్తైన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే సామర్థ్యం లేదని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పడం పూర్తిగా అసత్యమని, మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగినా మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోతల చేయగలమని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని తీసుకువస్తున్నప్పుడు అది కాళేశ్వరం ప్రాజెక్టు భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, సీఎం తిట్లు, విమర్శలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు బంధు, పెన్షన్లు, మహాలక్ష్మి వంటి హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క కాలువను తవ్వారా, ఒక చెక్ డ్యామ్ నిర్మించారా, ఉమ్మడి జిల్లాలో కనీసం పది వేల ఎకరాలకు సాగునీరు అందించారా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల మధ్యకు పోలీసుల రక్షణ లేకుండా రావాలని, అప్పుడు ప్రజలే సమాధానం చెబుతారని హరీష్ రావు పేర్కొన్నారు.






