పంటలకు నీళ్లివ్వమంటే రక్తార్పణం చేసుకోమంటారా: ఎమ్మెల్యే

by Kodari Anjali |

హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్ సర్కార్‌పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు.

పంటలకు నీళ్లివ్వమంటే రక్తార్పణం చేసుకోమంటారా: ఎమ్మెల్యే
X

దిశ, గంగాధర: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, పైగా హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపించేలా మాట్లాడటం దారుణమని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "రేవంత్ రెడ్డి నువ్వు చీఫ్ మినిస్టర్ వా.. లేక చీప్ మినిస్టర్ వా?" అంటూ ధ్వజమెత్తారు. పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే.. రక్తార్పణం చేసుకోమని అనడం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకి అని దుయ్యబట్టారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక, పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సుంకె రవిశంకర్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోక సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా, మరోవైపు ప్రాణహిత నుంచి నీళ్లు దిగువకు వృథాగా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సాగునీరు ఇచ్చే అంశంపై సీఎం దృష్టి పెట్టాలని డిమాండ్

ఆ నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు కోరితే.. రేవంత్ రెడ్డి మాత్రం బాధ్యత మరిచి తిట్ల దండకాన్ని అందుకున్నారని విమర్శించారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడటమేనా రాష్ట్రాన్ని నడిపించడం? అని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను అడ్డం పెట్టుకుని కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి.. నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని కనీసం ఒక్కసారైనా ఇంజనీర్లతో మాట్లాడారా? అని నిలదీశారు. కరువు వచ్చినప్పుడు బ్యారేజీలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నా, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఆగమాగం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను తనకు అనుకూలంగా అసెంబ్లీలో వాడుకున్న రేవంత్ రెడ్డి.. ఇవాళ వారు ప్రభుత్వానికి భిన్నంగా లేఖ రాసేసరికి వారిపై హింసాత్మక భాషను వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నీళ్లు ఇవ్వమని అడగడమే తాము చేసిన నేరమా అని ప్రశ్నించిన ఆయన.. ప్రతిపక్ష నేతలను దూషించి వికృత ఆనందం పొందడం పక్కన పెట్టి, ఇప్పటికైనా రైతులకు సాగునీరు ఇచ్చే అంశంపై సీఎం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Next Story