- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో ఓ అసెస్మెంట్ కాపీపై కమిషనర్ సత్య ప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది.

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మున్సిపాలిటీలో ఓ అసెస్మెంట్ కాపీపై కమిషనర్ సత్య ప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. పట్టణానికి చెందిన సమిండ్ల మల్లయ్య పేరిట ఉన్న 3-5-128 ఇంటి నంబర్‌కు 2011-12 నుంచి 2026-27 వరకు రూ.52,356 ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు మున్సిపల్ రికార్డులు చెబుతున్నాయి. అయితే 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిగా చూపిస్తూ పన్ను మినహాయింపు కోసం నకిలీ అసెస్మెంట్ కాపీలు రూపొందించినట్లు సమాచారం. వాస్తవంగా ఆస్తి పన్ను బకాయి ఉన్న అసెస్మెంట్‌లకు రిజిస్ట్రేషన్ చేయకూడదనే నిబంధనం ఉండగా దాని నుండి తప్పించుకునేందుకు ఈ నకిలీ అసెస్మెంట్ లు తయారు చేసి కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తుంది.
వాటి ఆధారంగా జూన్ 25న మ్యూటేషన్ చేసి తరువాత 3-5-128, &3-5-128/1/A/1 ఇంటి నంబర్లను నమోదు చేశారు. అనంతరం డాక్యుమెంట్ నంబర్ 4239/2026 కింద పార్టిషన్ డీడ్ ద్వారా మల్లయ్య వారసులైన సమిండ్ల రాజేష్, సమిండ్ల గంగరాజం పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై కమిషనర్ సత్య ప్రణవ్ స్పందిస్తూ, సంతకం ఫోర్జరీ వ్యవహారంపై దర్యాప్తు కోరుతూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెస్మెంట్ కాపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు ఇవ్వబోమని, అలాంటప్పుడు అవి ఎలా బయటకు వెళ్లాయన్న విషయం పోలీసుల దర్యాప్తులోనే తేలుతుందని పేర్కొన్నారు.






