మృత్యుపాశంలా పొగమంచు

by Ratna Kumari |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా దట్టమైన మంచు కురుస్తోంది.

మృత్యుపాశంలా పొగమంచు
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా దట్టమైన మంచు కురుస్తోంది. ఉద‌యం 10 గంటలు దాటినా కానీ మంచు మాత్రం కురుస్తూనే ఉంది. చీక‌టిగా ఉండ‌టంతో స‌మీపంలో వ‌చ్చే వాహ‌నాలు, మ‌నుఫులు ఎవ్వ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. రోడ్లపై ఇసుక లారీల యమపాశం అయ్యాయి. మానకొండూరు మండలంలోని ఊటూర్, పచ్చునూరు, పోచంపల్లి, రంగపేట, లలితపూర్, అన్నారం గ్రామాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తెరలు వీడకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రమాదకర పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. క‌నుచూపు మేర వ‌ర‌కు దారి క‌నిపించ‌డం లేదు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని రీతిలో ఉన్నాయి. మంచు కురుస్తుండటంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వాహనదారులు హెడ్ లైట్లు ఆన్ చేసినప్పటికీ దారి సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ప్ర‌కృతి సృష్టిస్తున్న ఇబ్బందులైతే.. మరోవైపు రోడ్లపై అడ్డగోలుగా నిలిపి ఉంచిన ఇసుక లారీలు వాహనదారులకు మృత్యుపాశాల్లా మారాయి. పొగమంచు వల్ల రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీలు కనిపించక ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు.పొగ‌మంచు తీవ్ర‌త ఎక్కువ ఉన్న త‌రుణంలో రోడ్లపై ఇసుక లారీల పార్కింగ్‌ను నియంత్రించాలని, ప్రయాణికులను అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Next Story