వరదల్లో చిక్కుకున్న ఐదుగురు రైతులు... రంగంలోకి డ్రోన్లు

by velandi.Saikiran |

కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పాల్వంచ వాగు, కూడవెళ్లి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో నర్మల

వరదల్లో చిక్కుకున్న ఐదుగురు రైతులు... రంగంలోకి డ్రోన్లు
X

దిశ, గంభీరావుపేట: కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పాల్వంచ వాగు, కూడవెళ్లి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో నర్మల ప్రాజెక్టులోకి అత్యధికంగా వరద నీరు చేరుతోంది. దాంతో ఎగువ మానేరు మత్తడి దూకి మానేరు వాగు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల క్యాంపు గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య గేదెలను మేపడానికి వెళ్లి గల్లంతయ్యాడు. అంతేకాకుండా జంగం సామి, పిట్ల నరసింహులు, ద్యానబోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి అనే ఐదుగురు రైతులు వరదలో చిక్కుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతేలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ తరుణంలోనే రెస్క్యూ టీమ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ డి ఆర్ ఎఫ్ డిపార్ట్మెంట్ ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. వరదల్లో చిక్కుకున్న రైతులతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి వారిని సురక్షితంగా బయటకు తీసుకువస్తామని మనోధైర్యాన్ని కల్పించారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా రైతులతో ఫోన్ లో మాట్లాడి అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. వారికి డ్రోన్ ల సహాయంతో ఆహారం అందిస్తామని తెలిపారు. దాని ప్రకారమే ఫుడ్ అందించారు. వీలైనంత తొందరగా వారిని ఒడ్డుకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా ఘటన స్థలంలో బాధితుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Next Story