కాళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by velandi.Saikiran |   (  Updated:2025-08-20 11:09:44  IST  )

కాళేశ్వరం వద్ద నీటి మట్టం పెరుగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

కాళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, మహదేవపూర్ : కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో గోదావరి, సరస్వతి ఘాట్ల వద్ద వరద ఉధృతిని ఎస్పి కిరణ్ ఖరే తో కలిసి పరిశీలించారు. బుధవారం ఉదయం 7 గంటలకు సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం 12.220 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజల ప్రాణరక్షణలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆరోగ్య తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. నది పరివాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితులలో సేవలు అందించడానికి ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్డీ ఆర్ ఎస్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన 9030632608 నంబర్ కు కాల్ చేయాలని ఆయన సూచించారు. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ అత్యవసర సేవలకు పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏదేని అత్యవసర పరిస్థితిలో పోలీస్ కంట్రోల్ రూము 100 కు కాల్ చేయాలని తెలిపారు. పరిసరాల్లోకి ప్రజలు వెళ్లకుండా పోలీస్ పటిష్ట నియంత్రణ చేయాలని సూచించారు. ఎగువ ప్రాజెక్టు ల నుండి వరద వస్తున్నందున ఎప్పటికప్పుడు వరద సమాచారం ప్రజలకు చేరవేస్తూ అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అనంతరం అన్నారం వెళ్ళు రహదారిలో చండ్రుపల్లి వద్ద కాజ్ వే పై నీళ్లు చేరిన ప్రాంతాన్ని పరిశీలించారు. పూర్తిగా నీరు తగ్గే వరకు ప్రజలను ప్రయాణాలు చేయకుండా భారీ కేడింగ్ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story