- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా ‘యాప్’ విధానం రద్దు చేయాలని రైతుల మహా ధర్నా
ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం రైతులకు శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.

దిశ, గంగాధర: ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం రైతులకు శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను నివారించాలని, ఎరువుల పంపిణీలో ప్రవేశపెట్టిన ‘యాప్’ ఆధారిత విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల, కరీంనగర్ జాతీయ రహదారిపై గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో భారీ మహా ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. కాగా, ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఇతర ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుల సమయంలో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించిన నాయకులను పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేశారు.
పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలి..
ధర్నాలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానం రైతులకు శాపంగా మారిందన్నారు. సాంకేతిక లోపాలు, అవగాహన లేకపోవడంతో అన్నదాతలు ఎరువుల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని మండిపడ్డారు. రైతుల సమస్యలపై శాంతియుతంగా పోరాడుతుంటే పోలీసులతో అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యాప్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఎరువులు పంపిణీ చేయాలని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహా ధర్నాలో పాల్గొన్న పలువురు రైతులు తమ ఆవేదనను వెల్లగక్కారు. "మాకు చదువు రాదు, చేతిలో స్మార్ట్‌ఫోన్లు లేవు.. అలాంటప్పుడు యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలో మాకు తెలియడం లేదు" అని వాపోయారు. ఇతరులను బ్రతిమిలాడి బుకింగ్ చేయించుకున్నా సమయానికి యూరియా దొరకడం లేదన్నారు. గతంలో సొసైటీలు, డీలర్ల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందేవని, ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని యాప్ విధానాన్ని స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల బిఆర్ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






