ఆఖ‌రి త‌డి కోసం రైత‌న్న‌ల ఆశ

by Ratna Kumari |

వేస‌వి కాలంలో ఎండ‌లు తీవ్రత పెరిగిన విష‌యం తెలిసిందే. దీంతో మండ‌లంలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి.

ఆఖ‌రి త‌డి కోసం రైత‌న్న‌ల ఆశ
X

దిశ, కథలాపూర్ : వేస‌వి కాలంలో ఎండ‌లు తీవ్రత పెరిగిన విష‌యం తెలిసిందే. దీంతో మండ‌లంలో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో వరి సాగు చేయడం రైతులకు కష్టంగా మారింది. ఆరుగాలం కష్టపడి పంట పండుతుందని ఆశించిన రైతులకు ప్రతి సంవత్సరం నిరాశే ఎదురవుతోంది. లక్షల్లో పెట్టుబడి పెట్టినా, చివరికి పెట్టుబడి డబ్బు కూడా తిరిగి రాని పరిస్థితి ఉంది. నీరు లేక కొందరు రైతులు తమ వరి పొలాలను పశువుల మేతగా వదిలేస్తున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలాంటి పరిస్థితులతోనే ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంత రైతులకు కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ పూర్తైతే పెద్ద ఊరట కలిగే అవకాశం ఉంది.

పశువుల మేతగా మారిన పంట పొలాలు

పంట చేతికి వచ్చే సమయంలో నీటి కొరత కారణంగా పొలాలు ఎండి పోతున్నాయి. కలికోట గ్రామంలో మినిగంటి బుచ్చయ్య, దూలం నర్సయ్య, రాగుల దుర్గయ్య, పెద్దిగారి భూమయ్య ఇలా ఒక్కో రైతు చెందిన సుమారు ఎకరం పైననే పంట పొలాలు ఎండిపోవడంతో చేసేది ఏమి లేక పశువుల మేతకు వదిలిపెట్టారు. అంబారిపేట గ్రామంలో అమందు దేవయ్య కు చెందిన 2 ఎకరాలు, తాండ్రియాల గ్రామంలోని గోపు లింబయ్య అనే రైతుకు చెందిన ఎకరం పొలం బోరు భావి ఎత్తివేయగా పూర్తి స్థాయిలో ఎండిపోయింది. ఇదే గ్రామంలో కాసారపు మామిండ్లు, కట్టుగాళ్ల ప్రాంతలలో భూగర్భ జలాలు పూర్తిగా అడగంటూతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలానికి ఆఖరి నీటి తడుల కోసం బోరు బావుల వద్దే కొద్ది మంది రైతులు రాత్రుళ్ళు కునుకు తీస్తున్నారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

కలికోట, అంబారిపేట, పోతారం, ఇప్పపెల్లి, తాండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు అడగంటాయి. ప్రధానంగా కలికోట సూరమ్మ చెరువుకు క్రింది భాగానా ఉన్న గ్రామాలు ఆ చెరువు భూగర్భ జలాల పైననే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆ చెరువులోని నీటిని అధికారులు గత ఖరీఫ్ సీజన్ లో క్రిందికి పూర్తి స్థాయిలో విడుదల చేశారు. బోరు బావుల మీదనే ఆధారపడి పంటలను పండించే రైతన్నలకు భూగర్బ జలాలు కూడా అడుగంటడడంతో సాగు నీటి కొరత ఏర్పడింది. దీంతో ఈ యాసంగిలో పంటలను కాపాడుకోవడానికి రైతులు భగీరథ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సుదూర ప్రాంతాల నుంచి పంటను కాపాడుకునేందుకు పైపు లైన్లను వేసుకుంటున్నారు.

ప్రాజెక్ట్ పూర్తయితే తీరనున్న కష్టాలు

కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. అలాగే ప్రాజెక్ట్ లో నీటి సామర్థ్యం పెంచే దిశగా 150 ఎంసీఎఫ్టీ నుంచి 450 ఎంసీఎఫ్టీ కి పెంచాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులు ఆదేశించారు. ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగు నీటి కష్టాలు తీరుతాయి.

స‌న్నకారు రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి : రైతు గంగారెడ్డి

యాసంగిలో పంట‌లు ఎండిపోతున్న స‌న్నకారు రైతుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు గంగారెడ్డి పేర్కొన్నారు.

సూరమ్మ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేయాలి : ఆర్. ల‌చ్చ‌య్య

గంభీర్ పూర్ గ్రామ కొచ్చేరువు ప్రాంతంలో భూగర్బ జలాలు అడుగంటాయి. కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి చేస్తే రైతుల కష్టాలు తీరుతాయని గంభీర్ పూర్ గ్రామానికి చెందిన‌ రెండ్ల ల‌చ్చ‌య్య పేర్కొన్నారు.

దూర ప్రాంతాల నుంచి పైపుల ద్వారా పొలాల‌కు నీళ్లు మ‌ళ్లిస్తున్నాం రైతు గోపు న‌ర్స‌య్య

ఆఖరి పంటలను కాపాడుకోవడానికి సుదురా ప్రాంతాల నుంచి పైపులు ద్వారా నీటిని పొలాలకు మళ్లీస్తున్నాం అని తాండ్రియాల గ్రామానికి చెందిన యువ రైతు గోపు న‌ర్స‌య్య పేర్కొన్నారు.

Next Story