సౌక‌ర్యాల కల్ప‌న మాది.. స‌హ‌క‌రించాల్సిన బాధ్య‌త మీది

by Ratna Kumari |

'సౌకర్యాల కల్పన మాది .... సహకరించాల్సిన భాద్యత మీది' అని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు.

సౌక‌ర్యాల కల్ప‌న మాది.. స‌హ‌క‌రించాల్సిన బాధ్య‌త మీది
X

దిశ, గోదావరిఖని : 'సౌకర్యాల కల్పన మాది .... సహకరించాల్సిన భాద్యత మీది' అని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. నగర పాలక సంస్థ తరపున ప్రజలకు కావాల్సిన‌ సౌకర్యాలను కల్పిస్తామని, ప్రజలు కూడా తమ వంతు భాధ్యతగా చెత్త బయట పడవేయకుండా నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు. వార్డు బాటలో భాగంగా బుధవారం రామగుండం నగర పాలక సంస్థ మూడవ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, వినాయక నగర్, దొడ్డి కొమురయ్య నగర్, శ్రీ నగర్ కాలనీ ప్రాంతాల్లో కార్పొరేటర్ వడ్లూరి రవి, అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. కార్పొరేటర్ తో పాటు స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అధికారులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి జీసీబీ, చైన్ జీసీబీ, బాబ్ కాట్ యంత్రాలతో పెద్ద మురుగు నీటి కాలువలో పూడిక తొలగించారు. మేయర్ కాలువ గట్టు పై నుంచి అధికారులకు ,సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు.


పని పూర్తయిన తరువాతనే అక్కడి నుంచి వెళ్లాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నగర పాలక సంస్థ , పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, ట్రాన్స్ కో తదితర ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి వాడ వాడలా తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు. తమ ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని చెప్పిన వెంటనే అప్పటికప్పుడే అక్కడిక్కడే వీధి దీపాలు పెట్టించారు. సుమారు 10 వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. తమ డివిజన్ కు మంచి నీళ్ళు రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఇండ్ల మీద వేలాడుతున్న కరెంట్ తీగలను సవరించాలని ట్రాన్స్ కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ది పనులు నిర్వహించడంలో అధికారులకు సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. స్థానికంగా ఉన్న హోటళ్ల నిర్వాహకులు కాలువల్లో చెత్త పడవేస్తున్నారని ఫిర్యాదు చేయగా తక్షణమే వారికి నోటీసులు అందజేసి జరిమానా విధించాలని ఆదేశించారు. రోడ్ల మీద , కాలువల్లో చెత్త వేసినా వాటిని ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్ వ‌డ్లూరి ర‌వి, స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు , డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఎస్ ఇ గురువీర, ఇఇపీ వి రామన్ , డీఈఈలు అఫ్తాబ్, జగదీష్ , షాభాజ్ , ఏఈ లు జమీల్, మీర్, మనోజ్, చంద్ర మౌళి, రాంజీ పాల్గొన్నారు.

Next Story