- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

దిశ, వేములవాడ : వేములవాడ పురపాలక సంఘం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు అనంతరం వార్డులకు సంబంధించిన ఓట్లను అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల ముందు బ్యాలెట్ బాక్సులు విప్పి లెక్కించారు.ఈ క్రమంలో మొత్తం 28వార్డులకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ 8స్థానాల్లో గెలుపొంది రెండో స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష బి.ఆర్.ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి 5సీట్లకే పరిమితమై మూడో స్థానంలో నిలిచింది. వీరితో పాటు ఇద్దరు అభ్యర్థులను విజయం వరించింది.
చైర్మన్ పీఠంపై ఉత్కంఠ
మరోవైపు చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి 15మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. ఈ క్రమంలో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. అయితే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన 7వ వార్డు అభ్యర్థి ఎలా శ్రీను, 19వ వార్డు నుండి గెలిచిన కుమ్మరి శిరీషల దారి ఎటు వైపు అనేదానిపై సందిగ్ధత నెలకొంది. అయితే వీరిద్దరూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు, ఇదే నిజమైతే అధికార పార్టీ చైర్మన్ పీఠాన్ని "చే"జిక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. దీనికి తోడు బి.ఆర్.ఎస్ పార్టీ నుండి గెలిచిన నరాల శేఖర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరి వైస్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పీఠం నల్లేరుపై నడకే అన్నట్లు తెలుస్తుంది. మరోవైపు 8సీట్లు గెలిచిన బీజేపీ, 5సీట్లు గెలిచిన బి.ఆర్.ఎస్ పార్టీలు సైతం చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. రెండు పార్టీలకు కలిపి వచ్చిన 13 స్థానాలతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని వీలైతే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని, ఇలా వీలు కానీ పక్షంలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్యల చేత వేములవాడలో ఓటు వేయించేలా చేసి చైర్మన్ పీఠం అందుకునేలా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలి.






