- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ లేకున్నా.. సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది.

దిశ, గోదావరి ఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. పారిశ్రామిక ప్రాంతంలో మూతబడిన పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూల్స్‌లో చదవని వారికి కూడా కావాల్సిన సర్టిఫికెట్లు ఇచ్చేస్తూ బదులుగా లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారికి ఇక్కడ చదువుకున్నట్టు ధ్రువపత్రాలు ఇవ్వడంతో ఉద్యోగాల్లో స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. వందల సంఖ్యలో ఫేక్ సర్టిఫికెట్లు గోదావరిఖని నుంచి వస్తున్నాయని ఓ ప్రభుత్వ రంగ సంస్థ అధికారులు చర్చించుకోవడంతో ఈ మాఫియా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు సర్టిఫికెట్లపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించిన క్రమంలో ఫేక్ దందా వెలుగులోకి వచ్చిందని అధికారులు చెప్తున్నారు.
లోతైన విచారణ చేయాలి..
గోదావరిఖని 5 ఇంక్లైన్‌కు చెందిన ఒక మూతపడిన పాఠశాల యాజమాన్యం వందల సంఖ్యలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సర్టిఫికెట్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు, ముఖ్యంగా సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ స్కూల్ కరస్పాండెంట్ తన స్కూల్ పేరుతోనే కాక, ఇతర మూతపడిన స్కూళ్ల పేర్లతో కూడా ఫేక్ స్టడీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవసరమైతే ప్రభుత్వ స్కూళ్ల సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తున్నారన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు, విద్యాశాఖ, రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ విభాగాలు సమిష్టిగా లోతైన విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






