- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణి వ్యాప్తంగా 50 చెరువుల ఏర్పాటు.. భూగర్భ జలాల పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక
సింగరేణి వ్యాప్తంగా 50 చెరువులను ఏర్పాటు చేయాలని, భూగర్భ

దిశ,గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా 50 చెరువులను ఏర్పాటు చేయాలని, భూగర్భ జలాలను పెంపొందించుటకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని సీఎం డి బలరాం నాయక్ అన్నారు. సోమవారం హైదరాబాదులోని సింగరేణి భవన్ లో సింగరేణి నీటి బిందువు - జల సింధువు అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. రెండు కిలోమీటర్ల పరిధిలో సహజ చెరువులు, కుంటల్లో నీటి నిల్వకు చర్యలు, జీవావరణ వృద్ధికి, జలచరాలు, పశుపక్ష్యాదుల పెరుగుదలకు అందరం పాటుపడాలన్నారు. పర్యావరణహిత మైనింగ్ ను పాటిస్తూ, కోట్లాది మొక్కలను నాటి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధికి సంస్థ ముందుంటుందన్నారు.
పంటలకు ప్రాణప్రదమైన నీటి విలువను గుర్తిస్తూ, మైనింగ్ ప్రాంతంలోనూ, ప్రాంతానికి వెలుపల రెండు కిలోమీటర్ల పరిధిలోను 50 మినీ చెరువులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. వీడియో సమీక్ష సమావేశంలో సీఎండీ ఎన్.బలరాం ఏరియా జీఎం లతో, అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జలవనురుల వృద్ధికి కొన్ని మార్గదర్శకాలను ఖరారు చేశారు. సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాలను పెంచడం కోసం, సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలో సైతం స్వచ్ఛమైన తాగునీరు అందించడం కోసం సంస్థ కృషి చేస్తోందన్నారు. ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని, జల వనరుల పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి చేపట్టనున్న చర్యల వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, తాగునీరు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటికే బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ సంపుల్లో నీటి శాతాన్ని పెంచాలని, తద్వారా సమీప ప్రాంతాల్లో వాటర్ లెవెల్ వృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓపెన్ కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంపుల మధ్య ఏర్పడే లోతట్టు ఖాళీ ప్రదేశాలను ఇకపై చిన్నపాటి నీటి తటాకాలుగా తీర్చిదిద్దాలని, వీటిని వర్షపు నీటితో, ఓపెన్ కాస్ట్ నుండి బయటకు పంపించే నీటితో నింపాలని భావిస్తున్నారు. జల వనరు కేంద్రాల లోనికి నీరు చేరడానికి, చేరిన నీరు బయటకు పంపించి సద్వినియోగం చేయడానికి కొన్ని సివిల్ నిర్మాణపు పనులు కూడా శాఖాపరంగా చేపట్టాలని నిర్ణయించారు. సింగరేణి గని ప్రాంతాలకు వెలుపల 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను కూడా అభివృద్ధి చేయాలని, వాటిలో ఎక్కువ నీరు నిలవ ఉంచేందుకు పూడిక తీయడం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు. స్థానిక గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల అంగీకారాన్ని పొంది, ఈ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు.
సింగరేణి ప్రాంతంలో భూమి లోపల నీటి ఫలకం పెరిగి జలవనరులు వృద్ధి చెందుతాయని, తాగునీరు, సాగునీటికి వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జల వనరుల పెంపుదలకు మాత్రమే కాక ఆ ప్రాంత జీవావరణ పరిరక్షణ కూడా ఉపయోగపడతాయని, వీటిలో చేపలు, కప్పలు వంటి జలచరాలను కూడా వృద్ధి చెందుతాయన్నారు. జల వనరుల కేంద్రాల లోని నీటిని శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ నాణ్యత పెంపుదలకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ సూచన మేరకు సింగరేణి సంస్థ ఈ భారీ పర్యావరణహిత పథకాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పా, పి అండ్ పి), హైదరాబాద్ కార్యాలయం నుండి ఈడీ (కోల్ మూమెంట్) ఎస్ డి ఎం.సుభానీ, ఫారెస్ట్ అడ్వైసర్ మోహన్ పరిగెన్ పాల్గొన్నారు.






