- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెలకు ఎన్నికల పండగ..!
రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, దీపావళి పండగలతో పాటు పల్లెలకు పంచాయతీ ఎన్నికల పండగ రాబోతుంది. దీపావళిలోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయడానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.

పల్లెలకు ఎన్నికల పండగ..!
- అతిత్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు
- మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ
- సీల్డ్ కవర్లలో రిజర్వేషన్లు
- ఆశావహుల్లో మొదలైన ఉత్కంఠ
- జిల్లాలో 260 సర్పంచ్, 2268 వార్డు సభ్యులు
- 12 ఎంపీపీ, జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలు
- జిల్లాలో 3,53,351 మంది ఓటర్లు
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, దీపావళి పండగలతో పాటు పల్లెలకు పంచాయతీ ఎన్నికల పండగ రాబోతుంది. దీపావళిలోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తి చేయడానికి తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తరువాత సర్పంచ్, అనంతరం మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సమరానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న క్రమంలో పంచాయతీల తుది ఓటరు జాబితా కూడా ప్రకటించారు. ఏ క్షణానైనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుండడంతో పల్లెల్లోని ఆశావాహులైన లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోంది.
గోప్యంగా రిజర్వేషన్లు
స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులు, పరిషత్‌ల ఓటర్ల తుది జాబితాలు వెల్లడించారు. ఇదే క్రమంలో స్థానిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ మూడు రోజులుగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అత్యంత గోప్యంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. బుధవారం ఉదయం మిగిలిన వార్డుల రిజర్వేషన్లు కూడా పూర్తిచేసి సీల్డ్ కవర్లో భద్రపరిచి ఉంచినట్లు తెలిసింది. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆయా కులాల నిష్పత్తి ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టారు. 2024 సంవత్సరంలో చేపట్టిన కులగణన ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై జిల్లాలో అధికార యంత్రాంగం పూర్తిచేస్తున్న క్రమంలో వివిధ పార్టీల నాయకులు ఆశావహులు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు గోప్యంగా ఉంచాలని ఎవరైనా రిజర్వేషన్లు లీక్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ప్రభుత్వం అధికారులకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో రిజర్వేషన్ల ప్రక్రియను అత్యంత గోప్యంగా ఉంచాలని అధికారులు చూస్తున్నారు.
ఖరారైన స్థానాలు
2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా, 252 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 56 స్థానాలు, ఎస్సీలకు 51, ఎస్టీలకు 30, జనరల్ స్థానాలు 115 రిజర్వ్ చేశారు. జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 12 జడ్పీటీసీ స్థానాల్లో అరు జనరల్ స్థానాలు, బీసీలు రెండు, ఎస్సీలు మూడు, ఎస్టీలు ఒకటి రిజర్వ్ చేశారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ స్థానాలు 64, బీసీలకు 25, ఎస్టీలకు 6, ఎస్సీలకు 28 స్థానాలు రిజర్వ్ చేశారు. కాగా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలో 12 జడ్పీటీసీలు, ఎంపీపీలు, 123 ఎంపీటీసీలు, 260 సర్పంచులు, 2268 వార్డు సభ్యుల స్థానాలు ఖరారయ్యాయి. 2019 లో స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో మూడు విడతలుగా జరిగాయి. ఈసారి కూడా మూడు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలు ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
జిల్లాలో 3,53,351 మంది ఓటర్లు
ఇప్పటికే ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం రాజన్న సిరిపిల్ల జిల్లాలో ఓటర్లు 3 లక్షల 53 వేల 351 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 170772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. ఇందులో పురుషులకంటే మహిళా ఓటర్లు 11787 మంది అధికంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 200 మంది ఓటర్లు ఉన్నచోట ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రత్యేక అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉండే పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించనున్నారు.
ఆశావహుల్లో మొదలైన ఉత్కంఠ
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వెళుతున్నట్లుగా ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాయడం, అదే క్రమంలో దసరాలోపే షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రిజర్వేషన్లపై ఆశావహులు టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియామక పదవులు దక్కకుండానే రెండేళ్లు గడిచిపోయింది. ఈక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వస్తే పదవులు దక్కుతాయని ఆశతో ఆశావాహులు ఉన్నారు. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం జడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 42 శాతం కేటాయించింది. 2019 రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తాజా లెక్కల ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామాలు మళ్లీ వారికే రిజర్వేషన్లు చేసినట్లుగా తెలిసింది. కాగా ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ మొదలైంది. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలో ఇప్పటికే జిల్లాలో సన్నద్ధత సమావేశాలు నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు.






