హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేయాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

by Ratna Kumari |

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వివాదాస్పదంగా మారిన డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేయాలి : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
X

దిశ, హుజురాబాద్ రూరల్ : ​ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వివాదాస్పదంగా మారిన డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆయన కలిశారు. ఈ మేరకు ప్రజల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు.

ప్రజల ఆరోగ్యంపై పంజా..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల కలిగే అనర్థాలను మంత్రులకు వివరించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా, స్థానికుల జీవన ప్రమాణాలు పడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలకు సమీపంలో చెత్త నిల్వ చేయడం వల్ల వెలువడే దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతారని పేర్కొన్నారు. వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితమై, భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దోమలు, ఈగలు పెరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పడిపోయి రైతులు, సామాన్యులు నష్టపోతారని వివరించారు. ​"ప్రజల ఆరోగ్యం కంటే ప్రాజెక్టులు ముఖ్యం కాదు. హుజురాబాద్ ప్రజల గొంతుకగా ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలి." అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు.

​పోరాటం ఆగదు..

హుజురాబాద్ ప్రజల ప్రయోజనాల కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ప్రజా పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వినతిపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Next Story