డంపింగ్‌ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

by Ratna Kumari |

డంపింగ్‌ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

డంపింగ్‌ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
X

దిశ,​ హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ మండలం సిరిసపల్లి శివారులో వెలసిన పురాతన ఐలోని మల్లన్న జాతర ఆదివారం వైభవంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి భారీ జన సందోహం మధ్య, బోనాలు, కోలాటాలు, ఒగ్గుడోళ్ల విన్యాసాల నడుమ ఫోర్ లైన్ రోడ్డు నుంచి నడుచుకుంటూ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సిరిసపల్లి సర్పంచ్ పొలసాని రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

డంపింగ్‌ యార్డుతో రైతుల బతుకులు ఆగం

ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్‌ యార్డ్ ప్రాంతంలోనే ఈ ఆలయం ఉండటంపై ఎమ్మెల్యే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డంపింగ్‌ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులు తమ విలువైన భూములను కోల్పోవడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు దారుణంగా పడిపోతాయని విమర్శించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు ను నిరసిస్తూ గత నెల రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ​"కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు, రైతుబంధు వంటి పథకాలతో ఇక్కడ ఎకరం ధర రూ. 25 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు పెరిగింది. ఇప్పుడు డంపింగ్‌ యార్డ్ తెస్తే ఆ భూములను రూ. 4 లక్షలకు కూడా కొనే నాథుడు ఉండడు. రైతులను కోటీశ్వరులను చేసిన భూములను ప్రభుత్వం నాశనం చేస్తోంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

​జైలుకైనా సిద్ధమే.. పోరాటం ఆగదు

​ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టినా, సీఐడీ దర్యాప్తు పేరుతో వేధించినా భయపడే ప్రసక్తే లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. "నన్ను నెల రోజులు జైల్లో పెడతారా? రెండు నెలలు పెడతారా? మీ ఇష్టం. నా నియోజకవర్గ ప్రజల ఆస్తులను, వారి జీవనోపాధిని కాపాడటం కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధం" అని తేల్చి చెప్పారు. డంపింగ్‌ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

9 మండలాలపై ప్రభావం

ఈ డంపింగ్ యార్డ్ వల్ల హుజురాబాద్, జమ్మికుంటతో పాటు కేశపట్నం, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ వంటి 9 మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దాదాపు 500 ఎకరాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమవ్వడం దుర్మార్గమని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కలుపుకొని భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జైపాల్ రెడ్డి, సామాజిక కార్యకర్త సబ్బని వెంకట్, జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం,వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story