ఊటూరులో తాగునీటి కష్టాలు

by Muthe.Rajitha |

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో ట్యాంక్‌లోకి నీరు స్టోరేజ్ కాకుండా దాదాపు 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

ఊటూరులో తాగునీటి కష్టాలు
X

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ఊటూరు గ్రామంలో ట్యాంక్‌లోకి నీరు స్టోరేజ్ కాకుండా దాదాపు 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. మిషన్ భగీరథ ట్యాంక్‌లోకి నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా అరవిందరెడ్డి విధుల్లో ఉన్నప్పటికీ 18 రోజులుగా కార్యాలయానికి రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటర్ ట్యాంక్ వద్ద గేట్ వాల్ పాడైపోయి, నీరు లీకేజీ అవ్వడం వల్ల ట్యాంక్‌లోకి నీటి సరఫరా అంతంతమాత్రంగానే జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సుమారు 20రోజుల కింద పైపులైన్ తవ్వినప్పటికీ మరమ్మతులు మాత్రం జరగడం లేదు. దీంతో తవ్విన కందకం వర్షాలకు కూలిపోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. మానేరు వాగు తలాపున ఉన్నప్పటికీ తాగేందుకు రెండు రోజులకొకసారి వంతులవారీగా తాగునీటి కష్టాలు తప్పడం లేదని, ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సమస్యతోపాటు వీధి దీపాలు, పైపులైన్ లీకేజీ, పారిశుధ్యం, డ్రైనేజీ వంటి సమస్యలపైనా అధికారులు దృష్టి సారించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై కరీంనగర్ జిల్లా కలెక్టర్ తక్షణమే చొరవ తీసుకుని తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story