కట్నం కోసమే కడతేర్చిన భర్త

by Ratna Kumari |

వరకట్న వేధింపులే యూట్యూబర్ హత్యకు కారణమని మెట్ పెల్లి డీఎస్పీ రాములు అన్నారు. ఈ మేరకు కోరుట్లలోని సీఐ కార్యాలయంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.

కట్నం కోసమే కడతేర్చిన భర్త
X

దిశ, కోరుట్ల రూరల్ : వరకట్న వేధింపులే యూట్యూబర్ హత్యకు కారణమని మెట్ పల్లి డీఎస్పీ రాములు అన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ రాములు బుధ‌వారం మీడియాకు వెల్లడించారు. మాదాపూర్ గ్రామానికి చెందిన చిత్తరి (గంధం) వైష్ణవి ని తన భర్త చిత్తరి హరిబాబు కత్తితో పొడిచి చంపాడు. దీంతో మృతురాలి తండ్రి గంధం దుర్గ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. గత 10 నెలల క్రితం తన కూతురు వైష్ణవిని ప్రేమిస్తున్నానని చెప్పి హరిబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి వివాహం చేసుకుంటానన్నాడు. కట్నం ఇవ్వలేమని చెప్పడంతో వెళ్లి పోయారు.

వైష్ణవిని హరిబాబు ప్రేమిస్తున్నాని వెంటపడి కొన్ని నెలల క్రితం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకోగా.. హరిబాబు కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడంతో అత్త గారింట్లో కాపురం పెట్టాడు. కొంత కాలం తరువాత రూ. 5లక్షలు కట్నం కావాలని కోరగా మాదాపూర్ గ్రామంలో 2గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. అంతేకాకుండా అదనపు కట్నంగా రూ. 5లక్షలు ఇవ్వాలని కోరుతూ 4నెలల గర్భవతిగా ఉన్న అమ్మాయిని వేధింపులకు గురిచేశారన్నారు. అదనపు కట్నం విషయంలో హరిబాబు తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్, అశోక్ లు ప్రేరేపించినట్లు మృతురాలి తండ్రి తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ నెల 16న వైష్ణవి, హరిబాబు లు రాత్రి 11గంటల సమయంలో గదిలోకి వెళ్లి పడుకున్నారని, మరుసటి రోజు వేకువజామున ఉదయం 4గంటల ప్రాంతంలో గదిలో అరుపులు శబ్దాలు వినిపించడంతో తలుపు తట్టిన వాళ్ళు తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయినట్లు తెలిపారు.


ఉదయం 6గంటల సమయంలో హరిబాబు గది నుండి బయటకు వచ్చి, ముఖం కడిగి, తన బైక్ పై వెళ్లిపోయాడన్నారు. అనంతరం దుర్గ ప్రసాద్ గదిలోకి వెళ్లి చూసేసరికి వైష్ణవి తన మంచం పక్కన రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించామని, వైష్ణవి నుదురు, మెడపై గాయలను గమనించి వెంటనే కోరుట్లలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు. వైష్ణవిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. వైష్ణవిని హత్య చేసిన నిందితుడు హరిబాబు కోనరావుపేట ఎక్స్ రోడ్ సమీపంలోని డబుల్ బెడ్ రూం ఇంటి మెట్ల కింద హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను దాచిపెట్టి సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. ఆ ప్రాంతంలో నిందితుడు ఉన్నాడనే సమాచారం మేరకు పోలీసులు వెళ్లి హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వ‌ద్ద‌ నుంచి కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు, ద్వి చక్ర వాహనంలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హత్య కేసుతో సంబంధం ఉన్న మిగితా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Next Story