దిశ ఎఫెక్ట్.. నల్ల బంగారు గనిలో కాపర్ సెగ కథనానికి స్పందన

by Nallavelli.Anjaneyulu |

దిశ దినపత్రికలో మే 01న ప్రచురితమైన నల్ల బంగారు గనిలో కాపర్ సెగ కథనానికి రామగుండం 3 ఏరియా జీఎం స్పందించారు.

దిశ ఎఫెక్ట్..  నల్ల బంగారు గనిలో కాపర్ సెగ కథనానికి స్పందన
X

దిశ, పెద్దపల్లి /కమాన్ పూర్ : దిశ దినపత్రికలో మే 01న ప్రచురితమైన నల్ల బంగారు గనిలో కాపర్ సెగ కథనానికి రామగుండం 3 ఏరియా జీఎం స్పందించారు. డ్రాగ్ లైన్ యంత్రం కేబుల్ లీడ్స్ చోరీ విషయంలో సింగరేణి యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటుందని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రామగుండం-3 ఏరియాలోని ఓసీపీ ఉపరితల గనిలో మట్టి వెలికితీత కోసం డ్రాగ్ లైన్ యంత్రాన్ని 1986లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ సీఎం నందమూరి తారక రామారావు ప్రారంభించి, దానికి పృథ్వీభంజన్ అని నామకరణం చేశారని వెల్లడించారు. అప్పుడు దాని ఖరీదు సుమారు 20 కోట్ల రూపాయలని తెలిపారు. యంత్రం కాలపరిమితి 30 సంవత్సరాలు కాగా సుమారు 33 సంవత్సరాల పాటు వినియోగించినట్లు పేర్కొన్నారు.


2020 సంవత్సరంలో కాల పరిమితి అయిపోయి ఓసీపీ1 ఉపరితల గని ఆవరణలో సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. ఇటీవల యంత్రం లోపల మోటర్ జనరేటర్ కు మధ్య కనెక్షన్ ఇచ్చే లీడ్స్ దొంగతనం జరిగింది. వైర్ విలువ ఒక కోటి 30 లక్షల రూపాయలు ఉంటుందని కథనాలు రావడం జరిగిందన్నారు. కేబుల్ లీడ్స్ స్క్రాప్ వాస్తవ విలువ అంచనా వేయలేదని వివరించారు. దొంగతనం జరిగిన తీరు పై అంతర్గతంగా విచారణ కొనసాగుతుందని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని జీఎం వెల్లడించారు.

Next Story