- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో విభేదాలు.. భర్త ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు కూతుర్లు
ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.

దిశ, ముత్తారం: ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన బండి రాజు (35) సోమవారం ఉదయం తన నివాసంలో ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాజుకు సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన శారదతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజు పలుమార్లు కుటుంబ పెద్దలతో పంచాయితీలు పెట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
గ్రామస్తులు మృతదేహంతో నిరసన వ్యక్తం..
ఇటీవల భార్య భర్తకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో రాజు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటన తెలిసిన వెంటనే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రాజు మృతికి కారణమైన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు గ్రామస్తులు మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. రాజు మృతితో ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి అనాథలుగా మారడం గ్రామస్తులను కలచివేసింది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత విభేదాలు ప్రాణాలు తీసే స్థాయికి చేరుకోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.






