- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరి
"జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం" కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు

దిశ, కరీంనగర్ కలెక్టరేట్,: పిల్లల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈనెల 13న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న "జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం" కార్యక్రమాన్ని జిల్లాలో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈనెల 13న 1 నుండి 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరికీ విధిగా నులిపురుగుల నివారణ మాత్రలు (అల్బెండజోల్) వేయాలని స్పష్టం చేశారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వైద్య ఆరోగ్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ, పంచాయతీ, మెప్మా, డి ఆర్ డి ఏ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ మాత్రల పంపిణీ, ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు.
నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, మాత్రల ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈనెల 13న మాత్రలు వేసుకోలేకపోయిన పిల్లల కోసం ప్రత్యేకంగా ఈనెల 20న మలి విడత కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు బాధ్యతగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,59,365 మంది 1 నుండి 19 లోపు పిల్లలు ఉన్నారని, 924 పాఠశాలల్లో, 66 జూనియర్ కాలేజీల్లో, 777 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లాలోని 632 మంది ఆశాలు, 777 మంది అంగన్వాడీ టీచర్లు, 990 మంది పాఠశాల, కళాశాలల ప్రతినిధులు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీలో చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు మాత్రల ప్రాధాన్యత తెలియజేయాలని, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులకు తప్పనిసరిగా మాత్రలు వేసేలా చూడాలని ఆదేశించారు. టామ్ టామ్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.






