- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కబ్జాదారుల బారి నుంచి చెరువును రక్షించాలని డిమాండ్...
హుజురాబాద్ పట్టణంలోని గుండ్ల చెరువును కబ్జాదారుల బారి నుండి కాపాడి, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు.

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణంలోని గుండ్ల చెరువును కబ్జాదారుల బారి నుండి కాపాడి, తక్షణమే హద్దులు ఏర్పాటు చేయాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. చెరువు భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, ఇరిగేషన్ ఈఈలను గురువారం కలిసి వారు వినతిపత్రాలు సమర్పించారు. చెరువు పక్కనే భూములు కలిగిన కొందరు వ్యక్తులు, సంబంధిత అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారని మత్స్యకారులు ఆరోపించారు. ఇందులో భాగంగానే చెరువుకు రక్షణగా ఉన్న మత్తడి రాళ్లను తొలగించి, చెరువు భూమిని కబ్జా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
500 కుటుంబాల జీవనాధారం..
దాదాపు 500 మత్స్యకార కుటుంబాలతో పాటు, ఈ చెరువు కింద ఉన్న ఆయకట్టు రైతులకు గుండ్ల చెరువే ఏకైక జీవనాధారమని సంఘం నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలోని 'గంగోని కుంట' కబ్జాదారుల చేతుల్లో పడి కనుమరుగైపోయిందని, ఇప్పుడు గుండ్ల చెరువుపై కూడా కబ్జాదారుల కన్ను పడిందని వారు ఆరోపించారు. చేపల వృత్తినే నమ్ముకుని బతుకుతున్న ముదిరాజ్, గంగపుత్ర కుటుంబాలకు ఈ చెరువు కూడా దూరమైతే తాము రోడ్డున పడాల్సి వస్తుందని కన్నీరుమున్నీరయ్యారు. గుండ్ల చెరువు పరిరక్షణకై తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మత్స్యకారులు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ను కూడా కలిసి చెరువు గోసను, కబ్జాదారుల అక్రమాలను వివరిస్తామని వారు పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి సర్వే నిర్వహించాలని, గుండ్ల చెరువుకు శాశ్వత హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు, చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించి మత్స్యకారులను, రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్, ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు గుడ్డేల్గుల సమ్మయ్య, అధ్యక్షుడు గుడ్డేల్గుల పోచయ్యతో పాటు సంఘం నాయకులు మౌటం రవీందర్, పిల్లి సమ్మయ్య, ఎంపటి సదానందం, శంకర్, గుడ్డేల్గుల రవి, సారయ్య, ఎంపటి సతీష్ కుమార్, బొగ్గుల రాజేశం, పెద్ద సంఖ్యలో మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.






