- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలయ ప్రవేశంలో దళితులకు అవమానం..!
కరీంనగర్ జిల్లాలో తీవ్ర కుల వివక్ష ఉదంతం వెలుగుచూసింది.

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లాలో తీవ్ర కుల వివక్ష ఉదంతం వెలుగుచూసింది. మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భక్తితో ఆలయంలోకి వచ్చిన కొందరు దళిత మహిళలను అడ్డుకోవడమే గాక కులం పేరుతో దూషించిన అమానుష ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు గ్రామస్తుల కథనం మేరకు..
దూషణలు.. నెట్టివేతలు!
గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాల పండుగను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో దళితులు కూడా భక్తిశ్రద్ధలతో తమ కుల దైవమైన మాతమ్మకు బోనాలు తయారు చేసుకొని, మంగళవారం రాత్రి ఎల్లమ్మ గుడి పక్కనే ఉన్న మాతమ్మ ఆలయానికి చేరుకున్నారు. కాగా కొందరు దళిత మహిళా శివసత్తులు మాతమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు ముగించుకున్న తర్వాత ఆనవాయితీ ప్రకారం ఎల్లమ్మ గుడి చుట్టు కూడా ప్రదీక్షణలు చేసేందుకు ఆలయం లోపలికి వెళ్తున్న క్రమంలో కొంతమంది గౌడ కులస్తులు వారిని లోపలికి రానివ్వకుండా చేతులు అడ్డుపెట్టి నెట్టివేశారని గ్రామస్తులు తెలిపారు. కొందరు గౌడ కులస్తులు కులం పేరుతో దూషించినట్లు దళితులు ఆరోపించారు.
గుడి ముందు దళితుల బైఠాయింపు!
ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన దళితులు అన్యాయాన్ని నిరసిస్తూ ఆలయం ముందే రోడ్డుపై బైఠాయించారు. "వి వాంట్ జస్టిస్"అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు జరిగిన అవమానానికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు.
రంగంలోకి ఎల్ఎండి పోలీసులు..
ఘటనపై సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ సయ్యద్ అన్వర్ తన సిబ్బందితో కలిసి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులతో మాట్లాడి.. వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, ఈ వివక్షపై పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హామీ ఇవ్వడంతో దళితులు తమ నిరసనను విరమించారు. ఈ విషయమై ఎస్ఐ అన్వర్ మాట్లాడుతూ.. 17 మంది గౌడ కులస్తులపై గ్రామానికి చెందిన దళితులు ఫిర్యాదు చేశారని వారి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.






