పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలకు బ్రేక్‌.. చమురు కూడా చల్లారింది!

by Ramesh Naini |

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త చల్లారడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి.

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం, వెండి ధరలకు బ్రేక్‌.. చమురు కూడా చల్లారింది!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త చల్లారడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల పవనాలు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ముడి చమురు ధరలు సైతం నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి.

బంగారం, వెండి తాజా ధరలు ఇవే..

10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారంపై సుమారు రూ.2,000 వరకు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో తులం పసిడి ధర రూ.1,47,100కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.33 లక్షల వద్ద ఉంది. కిలో వెండిపై ఒకే రోజు ఏకంగా రూ.10 వేల వరకు క్షీణించి, ప్రస్తుతం రూ.2.30 లక్షల వద్ద ట్రేడ్ అవుతోంది.

ధరల పతనానికి ప్రధాన కారణాలు..

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న సంకేతాలతో డాలర్ ఇండెక్స్ బలపడింది. అమెరికా బాండ్లపై రాబడులు పెరుగుతుండటంతో మదుపర్లు బంగారం, వెండిలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. చైనాలో వెండి వినియోగం భారీగా తగ్గడం కూడా ధరల పతనానికి దారితీసింది.

దిగొచ్చిన చమురు.. పెట్రోల్ ధరలు తగ్గుతాయా?

అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర నాలుగు నెలల కనిష్టానికి (76.54 డాలర్లకు) పడిపోయింది. ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షల సడలింపులు, హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభం కావడంతో మార్కెట్‌లో చమురు లభ్యత పెరిగింది. ముడి చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు, రూపాయి బలోపేతానికి సానుకూల అంశమే అయినప్పటికీ.. సామాన్యులకు తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు రూపంలో ఊరట లభించే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రిటైల్ మార్కెట్‌లో ఇంధన ధరల తగ్గింపు కోసం మరికొంత కాలం వేచిచూడక తప్పదు.

Next Story