సహజ వనరుల విధ్వంసం

by Ratna Kumari |

వ్యక్తిగత స్వార్థం కోసం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు విధ్వంసమవుతున్నాయి.

సహజ వనరుల విధ్వంసం
X

దిశ, కొణిజర్ల : వ్యక్తిగత స్వార్థం కోసం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు విధ్వంసమవుతున్నాయి. అక్రమ సంపాదనే ధ్యేయంగా కొందరు చెరువులు, గుట్టలు, కొండలు వంటి సహజ వనరులను కొల్లగొడుతున్నారు. మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుండగా, సహజ వనరుల వినాశనంలో మట్టి మాఫియా కీలక పాత్ర పోషిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని చెరువులు, కాలువ కట్టలు, ప్రభుత్వ భూములను తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తూ అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మట్టికి మంచి డిమాండ్ ఉండటంతో కొందరు దీనిని ఆదాయ వనరుగా మార్చుకుని అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ మట్టిని రూ.1,200 నుంచి రూ.1,500 వరకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ మట్టి దందా వ్యవహారాన్ని పరిశీలిస్తే, మండల పరిధిలోని పెద్దగోపతి గ్రామం కేంద్రంగా ఈ వ్యాపారం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దగోపతి గ్రామ రెవెన్యూ పరిధిలో కోమట్లగూడెం వెళ్లే రహదారి పక్కన ఉన్న బంచరాయి భూమిలోని గుట్ట నుంచి ప్రతిరోజూ విచ్చలవిడిగా మట్టి తోలకాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ 10 నుంచి 15 అడుగుల లోతు వరకు తవ్వి భూమి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తవ్వి విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా చింతకాని మండలం కోమట్లగూడెం, నేరడ, చిన్నగోపతి, లింగగూడెం, పెద్దమనగాల తదితర గ్రామాలకు మట్టిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మట్టి తోలకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని చెరువులు, కాలువ కట్టలపై జరుగుతున్న అక్రమ తవ్వకాలను అరికట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ అరుణను వివరణ కోరగా, ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story