సమన్వయంతో అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

సమన్వయంతో  అభివృద్ధికి కృషి :  ఎమ్మెల్యే
X

దిశ, జహీరాబాద్: ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ( దిషా) సమావేశం నిర్వహించారు. సమావేశానికి శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఇతర అధికారులు హాజరయ్యారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ అభివృద్ధి పథకాల అమలును సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమృత్ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కొత్తగా నిర్మించిన గృహాలలో సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను విస్తృతంగా అమలు చేయాలని సూచించారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీలలో బోర్‌వెల్‌ల నిర్వహణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో మురుగు నీటి నిల్వలు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కోహీర్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేసి, ప్రజా సేవలను మరింత మెరుగుపరచాలని కోరారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సమన్వయంతో పనిచేసి ప్రజలకు పూర్తి స్థాయిలో ప్రయోజనాలు అందేలా చూడాలని అన్నారు. అభివృద్ధి పనుల అమలులో నాణ్యతా ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, పారదర్శక పాలన అందించాలని సూచించారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

Next Story