అనుమతులు లేకుండా పుస్తకాల నిల్వ..గదికి MEO సీజ్

by velandi.Saikiran |

ఓ అద్దె ఇంట్లో భారీ మొత్తంలో శ్రీ చైతన్య స్కూల్ పాఠ్య పుస్తకాలను నిల్వ ఉంచిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

అనుమతులు లేకుండా పుస్తకాల నిల్వ..గదికి MEO సీజ్
X

దిశ, భీమదేవరపల్లి: ముల్కనూరు గ్రామంలో ఓ అద్దె ఇంట్లో భారీ మొత్తంలో శ్రీ చైతన్య స్కూల్ పాఠ్య పుస్తకాలను నిల్వ ఉంచిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఫిర్యాదుల మేరకు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) సునీతారాణి, పోలీసుల సమక్షంలో బుధవారం తనిఖీలు నిర్వహించి పుస్తకాల నిల్వ గదిని సీజ్ చేశారు. తనిఖీల సందర్భంగా సుమారు రూ.25 లక్షల విలువైన పాఠ్యపుస్తకాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో బుక్ సెట్ ధర రూ.5 వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. అద్దె ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో పుస్తకాలు ఎందుకు నిల్వ ఉంచారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

పుస్తకాల నిల్వకు సంబంధించిన అనుమతులు, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఈఓ సునీతారాణి మాట్లాడుతూ, ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించి గదిని సీజ్ చేసినట్లు తెలిపారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మాలోతు రాజేష్ మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే విధంగా ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యవహరించరాదన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకుల మనోజ్, జిల్లా ఉపాధ్యక్షుడు అమ్ముల జయకృష్ణ, జిల్లా నాయకుడు మాదం మణికాంత్ వీరితోపాటు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Next Story