వడ్డీ రేట్ల పెంపుపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |

వడ్డీరేట్లు పెరుగుతాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆర్‍బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

వడ్డీ రేట్ల పెంపుపై ఆర్‌బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వడ్డీ రేట్ల పెంపుపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం వడ్డీ రేట్ల పెంపుపై తక్షణ నిర్ణయం తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న చమురు ధరల ప్రభావం, ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్‌బీఐ నిశితంగా గమనిస్తోందని ఇటువంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపుపై మాట్లాడటం తొందరపాటే అవుతుందన్నారు. ఈ మేరకు మార్కెట్‌లో వడ్డీ రేట్ల పెంపుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు. ఒకవేళ మేము మార్కెట్‌ను వడ్డీ రేట్ల పెంపునకు సిద్ధం చేయాలనుకుంటే.. మా ద్రవ్య విధాన వైఖరిని న్యూట్రల్ నుండి రెస్ట్రిక్టివ్‍గా మార్చేవాళ్లమని వివరించారు. వడ్డీ రేట్లపై ఎంపీసీ కమిటీ ప్రతి సమావేశంలోనూ పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

విదేశీ మారక నిల్వలపై:

కరెన్సీ మార్కెట్, అంతర్జాతీయ అస్థిరతపై అందరిలోనూ ఆందోళన ఉందని.. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం ఒక పెద్ద సానుకూల అంశమని ఆయన అన్నారు. రూపాయికి మద్దతుగా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలకు మంచి స్పందన లభించిందని చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం మరింత ఆరోగ్యకరంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్పెక్యులేషన్‌ను అరికట్టడానికి తీసుకున్న చర్యల వల్ల ఫారెక్స్ మార్కెట్‌లో కదలికలు క్రమబద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారతీయ బాండ్లను బ్లూమ్‌బెర్గ్ లేదా ఇతర గ్లోబల్ ఇండెక్స్‌లలో చేర్చితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు దేశానికి పూర్తి భద్రతను ఇస్తున్నాయని గవర్నర్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు. మన ఫారెక్స్ రిజర్వ్ వ్యూహం అనేది ముఖ్యంగా భద్రత, లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), మరియు రాబడి అనే సూత్రాలపై ఆధారపడి నిర్మించబడిందని తెలిపారు. ఫారెక్స్ నిల్వలలో భాగంగా ఉన్న బంగారం నిల్వలు కూడా అవసరమైనప్పుడు భద్రత, లిక్విడిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆర్‌బీఐ గవర్నర్ వివరించారు.

Next Story