పేరుకే సీహెచ్‌సీ.. సేవల్లో పీహెచ్‌సీ కంటే దారుణం

by Kodari Anjali |

మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల కేవలం పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)గా మిగిలిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పేరుకే సీహెచ్‌సీ.. సేవల్లో పీహెచ్‌సీ కంటే దారుణం
X

దిశ, వెంకటాపురం(నూగూరు): మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల కేవలం పేరుకే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)గా మిగిలిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీహెచ్‌సీ స్థాయిలో ఉండాల్సిన వైద్య సదుపాయాలు, వైద్య నిపుణులు, అత్యవసర సేవలు లేకపోవడంతో ఈ ఆసుపత్రి పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) కంటే కూడా దారుణంగా ఉందని రోగులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాపురం మండల కేంద్రంతో పాటు మండలంలో ఉన్న పరిసర గ్రామాల ప్రజలు ఆరోగ్య సేవల కోసం ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. అయితే ఆసుపత్రిలో తగిన సంఖ్యలో వైద్యులు, నిపుణులు లేకపోవడంతో రోగులకు సకాలంలో చికిత్స అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వైద్యుల కొరత.. రోగుల అవస్థలు

సీహెచ్‌సీ స్థాయిలో సాధారణ వైద్య సేవలతో పాటు ప్రసూతి, శిశు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలి. కానీ వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు వైద్య సేవలు అందక జిల్లా కేంద్రం లేదా ఇతర ప్రాంతాల వైద్యశాలలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

అత్యవసర సేవలకు దూరమవుతున్న ప్రజలు

రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన రోగులకు తక్షణ వైద్య సేవలు అందాల్సి ఉన్నప్పటికీ, అవసరమైన పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చికిత్సలో జాప్యం జరిగి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గిరిజన ప్రాంత ప్రజలకి వైద్యం అందని ద్రాక్ష

వెంకటాపురం మండలం ఏజెన్సీ ప్రాంతం కావడంతో అనేక గిరిజన గ్రామాల ప్రజలు ఈ ఆసుపత్రిపైనే ఆధారపడుతున్నారు. అయితే మెరుగైన వైద్య సేవలు అందించడంలో విఫలం అవ్వడంతో ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే మారింది పేద, మధ్యతరగతి గిరిజన కుటుంబాలు ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కోవడం తో పాటు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం వల్ల అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని వాపోతున్నారు.

సీహెచ్‌సీ హోదా ఉన్నా ప్రయోజనం ఏం ఉందని..?

ప్రభుత్వం సీహెచ్‌సీ హోదా కల్పించినప్పటికీ, ఆ స్థాయికి తగ్గ మౌలిక సదుపాయాల కల్పనలో , వైద్య సేవలు అందుబాటులో తీసుకురాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకే సీహెచ్‌సీగా ఉండి, సేవల్లో మాత్రం పీహెచ్‌సీ కంటే దారుణంగా ఉంటే హోదా కల్పించిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం స్పందించి...

వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అత్యవసర వైద్య పరికరాలు, మెరుగైన చికిత్స సౌకర్యాలు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీహెచ్‌సీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. "పేరుకే సీహెచ్‌సీగా కాకుండా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దాలని" స్థానికులు, ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Next Story