ద‌ళిత మ‌హిళా స‌ర్పంచ్ గా అవ‌మానాలు ఎదుర్కొంటున్న : స‌ర్పంచ్ యాద‌మ్మ

by Ratna Kumari |

అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంటే.. కొంద‌రు వ్య‌క్తులు అభివృద్ధిని అడ్డుకోవాలని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పోతుగల్ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ- శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ద‌ళిత మ‌హిళా స‌ర్పంచ్ గా అవ‌మానాలు ఎదుర్కొంటున్న :  స‌ర్పంచ్  యాద‌మ్మ
X

దిశ, ముస్తాబాద్ : అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంటే.. కొంద‌రు వ్య‌క్తులు అభివృద్ధిని అడ్డుకోవాలని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పోతుగల్ సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ- శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణంలో సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ విలేక‌ర్ల స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ...ఉపసర్పంచ్ తన పై కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులు పూర్తిగా అసత్యమని ఖండించారు. “నేను ఒక దళిత మహిళా సర్పంచ్‌గా ఎన్నికై మూడు నెలలు మాత్రమే అయింది. ప్రమాణ స్వీకారం రోజు నుంచే ఉపసర్పంచ్ నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, ప్రతి విషయంలో అధికారం చలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా అనుమతి లేకుండానే ఇద్దరికీ ఒకే విధంగా కుర్చీలు ఏర్పాటు చేయించడం వంటి చర్యలు తీసుకున్నారు” అని ఆరోపించారు.

మార్చి 10, 2026న జరిగిన పాలకవర్గ సమావేశంలో గ్రామాభివృద్ధి పనులపై చర్చ సందర్భంగా, కొందరు సభ్యులు కమీషన్ల విషయాన్ని ప్రస్తావించారని తెలిపారు. “గ్రామంలో ఎలాంటి కమీషన్లు లేకుండా పారదర్శకంగా పనులు జరగాలని నేను చెప్పాను. అదే కారణంగా నాపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారు” అని పేర్కొన్నారు. మార్చి 11, 2026న రైతు వేదికలో జరిగిన గ్రామ సభ త‌రువాత తాను భోజనానికి వెళ్లిన సమయంలో కొంతమంది వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయం ఛాంబర్ తాళాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని చెప్పారు. “సర్పంచ్ అనుమతి లేకుండా గది తెరవడం సాధ్యం కాదని చెప్పినా వినకుండా, మహిళా వార్డు సభ్యుల ద్వారా ఫోన్ చేసి ఒత్తిడి చేశారు. అపార్థాలు కలగకుండా తాళాలు ఇవ్వలేకపోయాను” అని వివరించారు. అదేవిధంగా తన భర్తను కూడా అవమానించారని, తాను దళిత మహిళగా అనేక అవమానాలు ఎదుర్కొంటూ గ్రామాభివృద్ధి కోసం ఓపికతో పని చేస్తున్నానని పేర్కొన్నారు. “గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, నిధులు తీసుకురావడం నా లక్ష్యం. కానీ కొందరు వ్యక్తులు అభివృద్ధిని అడ్డుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. గ్రామ ప్రజలు నాకు అండగా నిలిచి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను” అని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

Next Story